రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహాయ సహకారాలు అందించలేదని ఏపీ సర్కార్‌కు హైకోర్టు మరోసారి తలంటింది. ఏపీ సర్కార్ వర్సెస్ ఎస్ఈసీ అన్నట్టు గత కొన్ని నెలలుగా సీరియల్‌గా వ్యవహారం నడుస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర వ్యవస్థ అని, దాన్ని కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని, లేకపోతే కూలిపోతుందని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తనకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ గతంలో వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌పై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది.
తనకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లి న్యాయంగా పదవి పొందిన వ్యక్తిని…ప్రభుత్వం కావాలనే ఎస్ఈసీకి సహకరించడం లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని పేర్కొంది. ప్రభుత్వం సహాయం అందిస్తే ఎస్ఈసీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండేది కాదని హైకోర్టు అభిప్రాయపడింది.
ఎస్ఈసీ విజ్ఞప్తులపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి ఏం కావాలనేది ఎస్ఈసీ మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి విన్నవించాలని హైకోర్టు తెలిపింది. ఎస్ఈసీ కోరినవన్నీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఒకవేళ అమలు చేయకపోతే అప్పుడేం చేయాలో తాము నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. అలాగే 15 రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా సీఎస్‌ను సుమోటోగా ప్రతివాదిగా చేర్చడం గమనార్హం.