దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందనరావు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు లేఖను పంపించారట.
బీజేపీ అభ్యర్థి సమీప బంధువుల వద్ద భారీగా డబ్బులు పట్టుబడిన నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థిని ఈ ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రఘునందనరావు కు సంబంధించిన వ్యక్తుల వద్ద రెండు సార్లు నగదు పట్టుబడిందనే విషయాన్ని శశిధర్ రెడ్డి ప్రస్తావించారు. ముందుగా స్థానికంగా సోదాల్లో డబ్బులు చిక్కినట్టుగా పోలీసులు ప్రకటించారు.
ఆ తర్వాత రఘునందనరావు బామ్మర్ది ఒకరు హైదరాబాద్ నుంచి కోటి రూపాయలను తరలిస్తున్నట్టుగా పట్టుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. వాట్సాప్ చాట్ ల ఆధారంగా ఆ డబ్బును దుబ్బాకలో పంచడానికి తీసుకెళ్తున్నట్టుగా నిర్ధారణ అయినట్టుగా పోలీసులు ప్రకటించారు.
లెక్క ప్రచారం చూస్తే.. ఇది సీరియస్ అంశమే. ఈ విషయంలో బీజేపీ ఎదురుదాడి చేస్తూ ఉంది కానీ, మరీ ఇలా భారీ మొత్తాలతో రఘునందనరావు సమీప బంధువులు పట్టుబడటం సంచలన అంశమే. పోలీసులే ఆ డబ్బును పెట్టి చూపించారు.. అనే వాదన డొల్లగా ఉంటుంది వినడానికి!
పోలీసులు టీఆర్ఎస్ వాళ్లను సోదాలు చేయడం లేదు అనే ఎదురుదాడి కూడా ఇదే సమయంలో బీజేపీ చేస్తోంది. ఈ వాదన ఎలా ఉన్నా.. ఇది వరకూ తమిళనాట జయలలిత మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నిక జరిగిన సీట్లో భారీ మొత్తంలో డబ్బులు పట్టుబడటంతో ఈసీ ఆ ఎన్నికల ప్రక్రియనే రద్దు చేసింది. ఈ నేపథ్యంలో శశిధర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈసీ ఎలా స్పందిస్తుందో!