రాజకీయమంటే అదే మరి. తమకు నచ్చిన మాటలనే ఒకటికి పదిసార్లు జనాలకు చెబుతూంటారు నేతలు. అదే ఇబ్బందికరమైన విషయాలు మీడియా ప్రస్తావించినా కూడా నో కామెంట్ అని తెలివిగా తప్పుకుంటారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఏపీకే కాదు, సౌతిండియాకే గర్వకారణం. ఉత్పత్తిలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న అతి పెద్ద ప్లాంట్ అది. మరి ఆ ప్లాంట్ ని విచ్చిన్నం చేయడానికి కుట్ర జరుగుతోందని స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు, వామపక్ష సంఘాలు కొన్ని నెలలుగా ఆరోపిస్తున్నాయి.
స్టీల్ ప్లాంట్ లో వాటాలను కొరియాకు చెందిన పోస్కో సంస్థకు ఇచ్చేయాలనుకుంటున్నారని కూడా విమర్శిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఖాళీగా ఉన్న భూములను కూడా పోస్కోకు కేంద్ర పెద్దలు కట్టబెట్టాలనుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
మరి విశాఖలో పర్యటించిన బీజేపీ సోము వీర్రాజు మాత్రం అసలు ఈ ఊసే చెప్పకుండా అన్నీ మాట్లాడారు. విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలను అభివృద్ధి చేస్తామని, తమకంటూ యాక్షన్ ప్లాన్ ఉందని చెప్పిన సోము గత కొన్ని నెలలుగా పోస్కో ప్రమాదంలో పడి స్టీల్ ప్లాంట్ గిలగిలా కొట్టుకుంటూంటే దాని మీద ఎందుకు మాట్లాడరు అని యూనియన్ నేతలు గట్టిగానే అడుగుతున్నారు.
విశాఖలో ఉన్న అతి పెద్ద ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం అందరి తక్షణ కర్తవ్యమని, దాన్ని కాదని ఎపుడో కొత్త పరిశ్రమలు తెస్తాం, అవి కడతాం, ఇవి కడతామని చెప్పడం వల్ల ఉపయోగం ఉందా అని ప్రశ్నిస్తున్నారు.
మరి సోము ఈ విషయంలో కలుగచేసుకుని కేంద్ర పెద్దలకు నచ్చచెప్పి చెప్పి విశాఖ స్టీల్ విషయంలో పోస్కో తో కేంద్రం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయించగలరా.. ఏమో..