అందరూ అధికారులే. బాధ్యత అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే చొరవ తీసుకుంటారు. వారు మాత్రమే సర్కార్ సొమ్ముకు గట్టి బందోబస్తు నిర్వహిస్తారు. అలాంటి వారే జన నీరాజనాలు అందుకుంటారు. ఆ కోవకు చెందిన అధికారి విశాఖలోని మైనింగ్ విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి.
ఆయన వచ్చాక విశాఖ జిల్లాల్లో మైనింగ్ మాఫియాకు అతి పెద్ద బ్రేకు పడిపోయింది. ఆయన మాఫియా కాళ్ళూ చేతులూ కట్టేశారు. వారి అక్రమాలకు వందల కోట్ల జరీమానా కూడా విధించారు. దాంతో కొండలను సైతం కొలిచేస్తూ విచ్చలవిడిగా దొలిచేస్తూ పర్యావరణానికి అతి పెద్ద ముప్పుని తీసుకువస్తున్న మైనింగ్ మాఫియాకు చెక్ పెట్టేశారు.
ఇక ఏం చేయాలో పాలుపోని ఈ మాఫియాకు ఆయన అరవీర భయంకరుడే అని చెప్పాలి. అయితే తాజాగా ప్రతాపరెడ్డికి పితృ వియోగం సంభవించింది. ఆయనసెలవు మీద వెళ్ళారు. అంతే ఈ చాన్స్ మళ్లీ రాదు అన్నట్లుగా విశాఖ జిల్లాలో మళ్ళీ మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది. రాత్రికి రాత్రే కొండలను పిండిచేస్తూ అక్రమంగా కోట్లాది రూపాయల విలువైన మెటీరియల్ ని తరలించేస్తోంది.
ఇక్కడ ఒక్కటే ప్రశ్న జనం నుంచి వస్తోంది. మైనింగ్ విభాగం అంటే ఎంతో మంది ఉంటారు కదా. ఒకే ఒక్క అధికారి సెలవు మీద వెళ్తే మాఫియా ఇంతలా చెలరేగిపోవడమేంటి. వ్యవస్థ టోటల్ గా చేష్టలుడినట్లుగా ఎందుకు అయిపోతోంది అని.
మొత్తానికి ప్రతాప్ రెడ్డి అంటేనే మాకు భయం తప్ప ఎవరూ కాదు అన్నట్లుగా మైనింగ్ మాఫియా సభ్య సమాజానికి సందేశం ఇస్తోందా. ఇలా అయితే రేపటి రోజున ఆయన బదిలీ అయి వెళ్ళిపోతే మళ్లీ అక్రమ మైనింగ్ అడ్డూ అదుపూ లేకుండా కొనసాగడం ఖాయమే కదా.