చేతకాని మనుషులు.. చలనం లేని మనసులు

ఏమైంది మనకి.. ఏమైంది మన మనసులకి.. కళ్ల ముందు ఘోరం జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నాం. మన చిన్న ప్రయత్నం వల్ల నిండు ప్రాణం నిలబడుతుందని తెలిసి కూడా ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నాం. కళ్ల ముందు…

ఏమైంది మనకి.. ఏమైంది మన మనసులకి.. కళ్ల ముందు ఘోరం జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నాం. మన చిన్న ప్రయత్నం వల్ల నిండు ప్రాణం నిలబడుతుందని తెలిసి కూడా ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నాం. కళ్ల ముందు హత్య జరుగుతుంటే సినిమా చూసినట్టు చూస్తూ నిల్చోవడం ఏంటి?

గుంటూరులో బీటెక్ స్టూడెంట్ రమ్య హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్ చూస్తే ఎవరికైనా ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మనిషిలో మానవత్వం చచ్చిపోయిందా..? మనసు స్పందించే గుణాన్ని కోల్పోయిందా..? సాటి మనిషిని కూసింత ఆదుకుందామనే ఇంగితజ్ఞానం అడుగంటిపోయిందా? ఈ ప్రశ్నలన్నీ వరుసపెట్టి మనసును తొలిచేస్తాయి.

నడిరోడ్డుపై రమ్య హత్య జరిగినప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు.. చుట్టుపక్కల ఏకంగా 10 మంది ఉన్నారు. వాళ్లలో కనీసం సగం మంది స్పందించినా ఈ దురాగతాన్ని మధ్యలోనే ఆపేవారు. ఓ నిండు ప్రాణాన్ని కాపాడేవారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే, అలాంటి ప్రయత్నాన్ని ఒక్కరంటే ఒక్కరు కూడా చేసినట్టు కనిపించదు. చివరికి అక్కడెక్కడో ఉన్న ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చాడు, కానీ అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రమ్య శరీరంపై చాలా కత్తిపోట్లు ఉన్నాయి. పొట్ట, గొంతు, పొత్తికడుపు భాగంలో కత్తి గాట్లు ఉన్నాయి. తొలిసారి కత్తి ఎత్తినప్పుడే మనిషిలోని మానవత్వం స్పందించి ఉంటే రమ్య కనీసం గాయాలతో బయటపడేది. ప్రాణాలు నిలబడేవి. వ్యక్తి చేతిలో కత్తి ఉంది నిజమే. దగ్గరకెళ్తే మనకు కూడా ప్రాణహాని కలగొచ్చు. కానీ అక్కడున్నది ఒక్కడు. చుట్టుపక్కలున్నది అటుఇటుగా 10 మంది. ఓ నలుగురు కలిస్తే, కత్తి పట్టుకున్న వ్యక్తి ఏం చేయగలడు? కనీసం దుండగుడిని దూరం నుంచి రాయిచ్చి కొట్టొచ్చు కదా. ''ఆ నలుగురు'' కలిసే లక్షణాన్ని సమాజం ఎప్పుడో కోల్పోయింది.

నిజం చెప్పాలంటే సమాజంలో ఉన్న ఈ నిర్లిప్తత, మనకెందుకులే అనే నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇలాంటి దుండగులు పుట్టుకొస్తున్నారు. సమాజం చూస్తోంది, కచ్చితంగా ఏదో చేస్తుందనే భయం ఉంటే ఇలా నడిరోడ్డుపై కత్తితో దాడికి పాల్పడ్డానికి ఎవరైనా భయపడతారు. ఇప్పటికైనా మనిషిలా బ్రతకాలి, మనలోని  మనసును తట్టిలేపాలి. మనం హీరోలం అయిపోనక్కర్లేదు, తోటివ్యక్తికి సాయపడే మనసున్న మారాజులం అనిపించుకుంటే చాలు, ఈ సమాజానికి అదే పదివేలు.