ఏపీ సీఎం జగన్, సోదరి షర్మిల మధ్య విభేదాలపై డెప్యూటీ సీఎం నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని శనివారం ఆయన దర్శించుకున్నారు.
అనంతరం ఆయన తాజా రాజకీయాలపై స్పందించారు. అన్నాచెల్లెలు మధ్య విభేదాలున్నాయని కొందరు వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. అన్నాచెల్లెలి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
అంతేకాదు, వాళ్లిద్దరి మధ్య ఎలాంటి విద్వేషాలు, మనస్పర్థలు లేవని నారాయణస్వామి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో ఆంధ్రా, తెలంగాణ వేర్వేరు కాదని చెప్పడం గమనార్హం. కేసీఆర్ అంటే జగన్‌కు మంచి అభిమానం ఉందని నారాయణ స్వామి తెలిపారు.
ఒకవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తెలంగాణ నీటిని కూడా రాయలసీమకు దోచుకెళ్లిన రాక్షసుడని తెలంగాణ మంత్రులు తిడుతుంటే, మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రి మాత్రం కేసీఆర్‌ను పొగడడంపై విమర్శలొస్తున్నాయి.
అసలే కేసీఆర్, జగన్ డ్రామాలాడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే, వాటికి బలం కలిగించేలా నారాయణస్వామి వ్యాఖ్యలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్, జగన్ మధ్య వ్యక్తిగత అభిమానుల గురించి మాట్లాడాల్సిన సమయమా ఇది అని వైసీపీ శ్రేణులు ఆవేశంతో ప్రశ్నిస్తున్నాయి.