లోక్ సభ స్పీకర్ నిర్ణయంపై ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన ఎంపీ చిరాగ్ పాశ్వాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎల్జేపీ లోక్ సభ పక్ష నేతగా ఎన్నికైన పశుపతి పరాస్ కు గుర్తింపును ఇస్తూ లోక్ సభ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన చిరాగ్ కు ఝలక్ తగిలింది.
ఈ విషయంలో కోర్టుకు రావడాన్నే న్యాయమూర్తులు తప్పు పట్టారట. ఈ తరహా పిటిషన్ తో తమ వద్దకు వచ్చిన చిరాగ్ కు జరిమానా విధించడానికి న్యాయమూర్తులు ఆలోచించినట్టుగా తెలుస్తోంది. అయితే చిరాగ్ తరపు న్యాయవాది విన్నపం మేరకు వదిలేశారట!
ఇటీవలి కేంద్ర మంత్రి పునర్వ్యస్థీకరణలో పశుపతి పరాస్ కు కేబినెట్ ర్యాంకు పదవి దక్కిన సంగతి తెలిసిందే. ఎల్జేపీ అధిపతిగా చిరాగ్ ను తొలగిస్తూ ఆ పార్టీ లోక్ సభ సభ్యులు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటుకు ఇప్పుడు బీజేపీ కూడా బాసటగా నిలిచింది.
పశుపతికి కేంద్ర మంత్రి పదవిని కేటాయించడం ద్వారా తిరుగుబాటు వర్గాన్నే అసలు పార్టీగా బీజేపీ గుర్తించింది. మోడీకి తను హనుమంతుడిని అంటూ చెప్పుకున్న చిరాగ్ కు గట్టి ఝలక్ అప్పుడే తగిలింది.
తన బాబాయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని చిరాగ్ అనుకున్నట్టుగా లేడు. పశుపతికి మోడీ పదవిని ఇచ్చిన వెంటనే కోర్టును ఆశ్రయించారు చిరాగ్. తనపై జరిగిన తిరుగుబాటుకు లోక్ సభ స్పీకర్ గుర్తింపును ఇవ్వడాన్ని అడ్డుకోవాలని కోర్టును కోరారు. అయితే ఈ వ్యవహారంలో కోర్టులో చిరాగ్ కు ఎదురుదెబ్బ తగిలింది.
అటు పశుపతికి కేంద్ర మంత్రి పదవి, ఇప్పుడు కోర్టులో ఎదురుదెబ్బ నేపథ్యంలో.. చిరాగ్ రాజకీయ భవితవ్యం మరింత గందరగోళంలో పడ్డట్టుంది. ఇప్పటికే తమదే అసలు ఎల్జేపీ అంటూ పశుపతి వర్గం ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించింది. మెజారిటీ లెజిస్లేటర్ల నిర్ణయాను సారం.. చిరాగ్ కు అక్కడ కూడా ఎదురుదెబ్బే తగిలినా ఆశ్చర్యం లేదేమో!