ప్రత్యేక హోదాపై వైసీపీకి చిత్తశుద్ధి లేనట్టు, జగన్ సర్కార్ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయట్లేదంటూ నోటికొచ్చినట్టు మాట్లాడేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. డ్రామాలు ఆపి స్పెషల్ స్టేటస్ పై ఉద్యమించాలంటూ పెద్దపెద్ద డైలాగులు కొట్టారు.
అయితే డ్రామాలు ఆడుతోంది వైసీపీ కాదని, ప్రత్యేక హోదా విషయంలో అసలైన డ్రామాలు ఆడింది టీడీపీనే అనే విషయం నాని మరిచిపోయినట్టున్నారు. అంతెందుకు.. ప్రత్యేక హోదాపై గడిచిన మూడేళ్లలో నాని చేసిన ప్రకటనలే ఆయన రెండు నాల్కల ధోరణికి అద్దం పడతాయి.
నాకు తెలిసినంతవరకు బీజేపీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదు.
దాదాపు ఏడాది కిందట 2019, జూన్ లో స్వయంగా నాని చేసిన ప్రకటన ఇది. పక్కనే రామ్మోహన్ నాయుడ్ని కూర్చోబెట్టుకొని మరీ ఈ ప్రకటన చేశారు నాని. ఓవైపు నాని అలాంటి ప్రకటన చేసినప్పటికీ.. వైసీపీ సర్కార్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఎప్పటికప్పుడు ప్రత్యేక హోదాపై విస్పష్టంగా ప్రకటన చేస్తూనే ఉంది.
“రాష్ట్ర విభజన సమయంలో ప్రధానమంత్రి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన మాట వాస్తవేమే. కానీ 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేం.” ఈ ఏడాది ఫిబ్రవరి 3న స్వయంగా కేశినేని నానికి పార్లమెంట్ సాక్షిగా వచ్చిన లిఖిత పూర్వక సమాధానం ఇది. చేతిలో ఈ సమాధానం పెట్టుకొని కూడా వైసీపీపై తప్పు నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు నాని. తామేదో గతంలో స్పెషల్ స్టేటస్ కోసం పోరాడినట్టు.. ఇప్పుడు వైసీపీ ఆ ప్రయత్నం చేయనట్టు కలరింగ్ ఇస్తున్నారు.
ఇదే వ్యక్తి, గతంలో జగన్ చేసిన ఓ ప్రకటనతో ఏకీభవించిన సందర్భం కూడా ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ వేదికగా జగన్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను ఓసారి చూద్దాం.. “రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కష్టం. కేంద్రం మనపై ఆధారపడే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేక హోదా సాధ్యమౌతుంది. మేం మాత్రం మా ప్రయత్నాల్ని కొనసాగిస్తాం. మా ప్రాధామ్యాల్లో ప్రత్యేక హోదా ఎప్పుడు ఉంటుంది.” ముఖ్యమంత్రి హోదాలో జగన్ చేసిన ఈ ప్రకటనను అప్పట్లో కేశినేని నాని స్వాగతించిన విషయాన్ని ఆయన మరిచిపోయినా ప్రజలు మరిచిపోలేదు.
అంతెందుకు.. ఇదే వ్యక్తి, రాష్ట్రానికి రాత్రికి రాత్రి ప్రత్యేక హోదా రాదంటూ గతంలో ప్రకటించలేదా..? అన్ని పార్టీలు కలవాలి, కేంద్రంపై వత్తిడి తీసుకురావాలి. మోడీకి మాటలెక్కువ, పని తక్కువ అని 2018 ఏప్రిల్ లో అన్న మాటల్ని నాని మరిచిపోయినట్టున్నారు. ఇలా ప్రత్యేక హోదాపై కేశినేని నాని ఆడిన డ్రామాలు, ప్రజల్ని మభ్యపెట్టేలా చెప్పిన మాటల్ని గూగుల్ లో వెదికితే లెక్కలేనన్ని వస్తాయి. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ చిత్తశుద్ధిని ప్రశ్నించడం పెద్ద కామెడీ.
పోనీ ఇవన్నీ వదిలేద్దాం.. అసలు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని గతంలో చంద్రబాబు అన్నప్పుడు ఈ కేశినేని నాని ఎక్కడున్నారు? ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తే జైళ్లో పెడతానంటూ బాబు గద్దించినప్పుడు కేశినేని ఎందుకు మాట్లాడలేదు? ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం లేదని బాబు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పినప్పుడు నాని చెవులు మూసుకున్నారా? అప్పుడు గురివింద గింజ కబుర్లు చెప్పిన నాని, ఇప్పుడు మాత్రం సీఎం జగన్ పై ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకుంటున్నారు.
చంద్రబాబు, నాని లాంటి నేతలు ఎన్ని మాటలైనా మార్చొచ్చు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టొచ్చు. కానీ జగన్ మాత్రం అలాంటి వ్యక్తి కాదు. ఎలాగైతే ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల్ని ఆఘమేఘాల మీద అమలు చేస్తున్నారో, ప్రత్యేక హోదాపై కూడా అదే విధంగా సమయం వచ్చినప్పుడు తప్పకుండా తన సత్తా చూపిస్తారు. ఈ విషయం ఏపీ ప్రజలందరికీ తెలుసు కాబట్టే నాని లాంటి వ్యక్తుల మాటల్ని వాళ్లు పెద్దగా పట్టించుకోరు.