ఎన్నికల కమిషన్ వణికిపోతోంది

ఎన్నికలు పెట్టి కరోనాని పెంచి పోషించారంటూ మద్రాస్ హైకోర్టు చీవాట్లు పెట్టిన సందర్భంలో.. ఎన్నికల కమిషన్ దాన్ని పెద్ద అవమానంగా భావించింది. మీపై మర్డర్ కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించడంతో నిజంగానే కలవరపడింది. ఆపై…

ఎన్నికలు పెట్టి కరోనాని పెంచి పోషించారంటూ మద్రాస్ హైకోర్టు చీవాట్లు పెట్టిన సందర్భంలో.. ఎన్నికల కమిషన్ దాన్ని పెద్ద అవమానంగా భావించింది. మీపై మర్డర్ కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించడంతో నిజంగానే కలవరపడింది. ఆపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా తిరస్కరణకు గురికావడం ఈసీకి మరో పెద్ద ఎదురు దెబ్బ. దీంతో ఎన్నికల పేరు చెబితేనే కమిషన్ ఉలిక్కిపడుతోంది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేసింది ఎన్నికల కమిషన్.

వాస్తవానికి ఎమ్మెల్యే కోటాలో జరిగే ఈ ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఓటర్లు. అంటే ఎన్నికల ప్రక్రియ చాలా సింపుల్. అయినా కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వకుండా తప్పించుకుంది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాతే ఎన్నికలంటోంది. మరోసారి ఎవరూ తమవైపు వేలెత్తి చూపకూడదనే ఉద్దేశంతో ఆచితూచి అడుగులు వేస్తోంది.

మే 31తో ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు, జూన్-3 తో తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు పదవీకాలం ముగుస్తుంది. ఈలోపుగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. 

మద్రాస్ హైకోర్టు మొట్టికాయలు పడకపోయి ఉంటే.. కమిషన్ కూడా ఎన్నికల ప్రక్రియకు సానుకూలంగా స్పందించేది. అయితే కోర్టు ఇచ్చిన ఫస్ట్ డోస్ బాగా పనిచేయడంతో ఈసీ అలర్ట్ అయింది. ప్రభుత్వాలు సూచించినా ఎన్నికలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పింది.

కేంద్ర ఎన్నికల సంఘమైనా, రాష్ట్ర ఎన్నికల సంఘాలైనా ప్రభుత్వం సలహాలు, సూచనలతోనే పనిచేస్తాయనే విషయం వాస్తవం. నిమ్మగడ్డ లాంటి వారు ఉంటే మాత్రం ప్రభుత్వం వద్దు వద్దంటున్నా తమ పంతం నెగ్గించుకునేందుకు ఎన్నికలు పెట్టి కరోనా కేసుల్ని పెంచి పోషించారు. కేంద్రం చెప్పినట్టు వినడం వల్లే బెంగాల్ లో 8 విడదల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియతో ఈసీ విమర్శలు మూటగట్టుకుంది.

వెనకనుంచి చేసేది ప్రభుత్వమే అయినప్పటికీ.. చివరికి కోర్టు చీవాట్లు మాత్రం ఈసీకే దక్కాయి. దీంతో ఇప్పుడు ఎన్నికలంటేనే ఈసీ భయపడుతోంది. అందుకే తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికలపై వెనకడుగు వేసింది. కరోనా కేసులు తగ్గాకే ఎన్నికలు జరుపుతామని, నింద తమపై వేసుకోలేమని తేల్చి చెప్పింది.