పెరిగిపోతున్న కరోనా కేసులు, అరకొర వైద్య సదుపాయాలు, జనాల్లో సరైన అవగాహన లేకపోవడం లాంటి కారణాలతో ఇండియాలో ఉద్యోగాలు చేసేందుకు విదేశీయులు మొగ్గుచూపడం లేదు. చాలామంది జాబ్ ఆఫర్లు వదులుకుంటున్నారు. మరికొంతమంది తమ జాయినింగ్ ను వాయిదా వేసుకుంటున్నారు.
అమెరికా, యూరోప్, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన చాలామంది ఇండియాలో ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. చాలామంది భారత్ లో కరోనా కల్లోలం చల్లారిన తర్వాత వచ్చి ఉద్యోగాల్లో చేరుతామంటున్నారు.
ఓ భారతీయ తయారీ సంస్థలో సీఎక్స్ఓ పొజిషన్ లో జాబ్ సంపాదించుకున్న బ్రెజిల్ దేశస్తురాలు ఒకరు, తన ఆఫర్ ను తిరస్కరించింది. రీసెంట్ గా ఆమె కరోనా కారణంగా దగ్గరి వ్యక్తిని కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పెనం నుంచి పొయ్యి లోకి పడే సాహసం చేయనని ఆమె చెప్పేసింది. అదే విధంగా ఓ బ్లూ-చిప్ కంపెనీలో ఆపరేషన్స్ హెడ్ గా జాబ్ సంపాదించుకున్న ఇటాలియన్ కూడా జాబ్ వదులుకున్నాడు. తన దేశంలో కరోనా పరిస్థితుల్ని కళ్లారా చూశానని, అవి చూసి మళ్లీ ఆ పరిస్థితుల్లోకి వెళ్లే సాహసం చేయనని చెప్పేశాడు.
ఓ బయోటెక్ కంపెనీలో సీఈవో జాబ్ దక్కించుకున్నాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. దేశంలో పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని, అతడికి 6 నెలల జీతాన్ని అడ్వాన్స్ గా ఇవ్వడానికి ముందుకొచ్చింది సదరు ఫార్మా కంపెనీ. అంతేకాదు.. దేశంలో కరోనా కల్లోలం చల్లారిన తర్వాతే వచ్చి జాయిన్ అవ్వొచ్చని లిఖిత పూర్వకంగా ఇస్తామంటూ ఆఫర్ చేసింది. కానీ ఆ అమెరికన్ తనకొచ్చిన భారీ ఆఫర్ ను తిరస్కరించాడు.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. లెక్కలేనన్ని ఆఫర్లను విదేశీయులు తిరస్కరిస్తున్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై, ఆక్సిజన్ అందుబాటు, వెంటిలేటర్ బెడ్స్ పై అంతర్జాతీయ మీడియా ఇస్తున్న కథనాలు చూసి విదేశీయులంతా భారత్ లో ఉద్యోగం చేసేందుకు వెనకాడుతున్నారు.
ఉన్న చోటు నుంచే పని
ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వెహికల్స్, రీటైల్, బయోటెక్, టెక్నాలజీ రంగాలకు చెందిన చాలా కంపెనీలు.. తమకు సంబంధించిన విదేశీ ఉద్యోగుల్ని వాళ్ల ప్రాంతం నుంచే పని చేయమని కోరుతున్నాయి. పరిస్థితులు చక్కబడిన తర్వాత రావొచ్చని చెబుతున్నాయి.
అంతేతప్ప, నిపుణుల్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే చాలా ఇండియన్ కంపెనీలు.. తమ విదేశీ ఉద్యోగులు వాళ్ల దేశం నుంచే పనిచేయొచ్చని చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఓ మౌలిక వసతుల తయారీ కంపెనీకి సీఈవోగా ఎంపికైన ఆస్ట్రేలియన్.. ప్రస్తుతం తన దేశం నుంచే ఇండియాకు వర్క్ చేస్తున్నాడు.
రాబోయే రోజుల్లో నిపుణుల కొరత మరింత ఏర్పడే పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే భారతీయ కంపెనీలు తమ ఉద్యోగుల్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అవసరమైతే తమ సొంత దేశం నుంచే పనిచేసేందుకు అనుమతులిస్తూ, ప్రత్యేకంగా నియమావళిని రూపొందిస్తున్నాయి.
ఇండియాకు జై కొడుతున్న ఎన్నారైలు
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితికి పూర్తి భిన్నంగా ప్రవాస భారతీయులు మాత్రం తమ దేశానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీళ్లలో 30-40 ఏళ్ల మధ్య ఉన్న ప్రొఫెషనల్స్ రావడానికి పెద్దగా ఆసక్తి చూపించనప్పటికీ.. 50 ఏళ్లు దాటిన ఎన్నారైలు మాత్రం, ఈ సంక్షోభ సమయంలో తమ తల్లిదండ్రులకు సహాయంగా ఉండేందుకు చాలా తపిస్తున్నారు. మంచి ఆఫర్లు ఉంటే చూడమని ఇండియన్ కన్సల్టెంట్లను సంప్రదిస్తున్నారు.
ఇందులో భాగంగా గడిచిన నెల రోజుల్లో అమెరికా, బ్రిటన్, సింగపూర్ నుంచి 20 మంది వరకు ప్రవాస భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్లంతా సీనియర్ మేనేజ్ మెంట్ పొజిషన్లలో ఉన్నారు. వాళ్ల పిల్లలు కూడా విదేశాల్లో స్థిరపడ్డారు. అయినప్పటికీ వీళ్లు మాత్రం వెనక్కి వచ్చేయడానికి తహతహలాడుతున్నారు.