బెజవాడ రాజకీయం రంజుగా సాగుతోంది. నిన్నటి వరకూ ఒకే పార్టీకి చెందిన కేశినేని నాని, బుద్ధా వెంకన్న సోషల్ మీడియాలో బూతులు తిట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరి ట్విట్టర్ వార్ కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. తాజాగా కేశినేనిని పీవీపీ తగులుకున్నారు. ట్విట్టర్ లో చెడుగుడు ఆడుకుంటున్నారు. అలా నాని పోస్టింగ్ పెడతారో లేదో ఇలా పీవీపీ కౌంటర్ ఇస్తున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు జీతాలివ్వకపోతే మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ముఖ్యమంత్రి గారూ.. అంటూ జగన్ ని టార్గెట్ చేస్తూ ఓ పేపర్ క్లిప్పింగ్ పెట్టారు నాని. దీనికి పీవీపీ నిమిషాల వ్యవధిలోనే కౌంటర్ ఇచ్చారు. “పధ్నాలుగేళ్లు ప్రభుత్వం నడిపినప్పుడు ఏం పీకారు? గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? కుంభకర్ణుడి లాగా ఇప్పుడు మెలకువ వచ్చింది అయ్యవారికి? మళ్లీ బజ్జో నాన్న, ఈసారి లెగిసే సరికి నభూతో నభవిష్యత్ లాంటి నవరత్నాల దీవెన, జగన్ పాలన కళ్లముందు ఉంటుంది” అంటూ ట్వీట్ చేశారు పీవీపీ.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న మొత్తం కాలంలో అసలు ఏం అభివృద్ధి జరిగింది అంటూ నిలదీశారు పీవీపీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్న పీవీపీ మళ్లీ ఇప్పుడు జోరు పెంచారు. తనపై స్వల్ప ఆధిక్యతతో గెలిచిన కేశినేని నానితో డైరెక్ట్ ఫైట్ కి దిగుతున్నారు. నాని బీజేపీలోకి వెళ్తారనే సమాచారం ఉన్నా.. ఆయన టీడీపీ అధినాయకత్వంతో అంటీముట్టనట్టుగా ఉన్నా, ట్విట్టర్ లో మాత్రం యాక్టివ్ గా ఉంటూ, ఎవరో ఒకరిపై సెటైర్లు వేస్తూ రోజూ వార్తల్లోకి వస్తున్నారు.
ఈ జోరుకి పీవీపీ రూపంలో కళ్లెం పడుతోంది. నానిపై పరువునష్టం దావా వేస్తానంటూ ఇటీవలే హెచ్చరించిన పీవీపీ.. ఆయనను సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. మొత్తమ్మీద బెజవాడ రాజకీయం మళ్లీ రంజుగా మారింది.