తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయిన బాలాపూర్ లడ్డూ వేలం ఈ ఏడాది ఘనంగా జరిగింది. అంతేకాదు, మరోసారి రికార్డ్ ధర పలికింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూను స్థానికంగా ఉంటున్న శశాంక్ రెడ్డి దక్కించుకున్నారు. కడప జిల్లా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో కలిసి 18 లక్షల 90వేల రూపాయలకు వేలం పాటలో లడ్డూను దక్కించుకున్నారు శశాంక్ రెడ్డి.
కరోనా వల్ల గతేడాది లడ్డూ వేలం జరగలేదు. అంతకుముందు, 2019లో ఈ లడ్డూ 17లక్షల 60వేల రూపాయలకు వేలం పాటలో అమ్ముడుపోయింది. ఈసారి ఆ మొత్తం ఇంకాస్త పెరిగింది. ఈ ఏడాది వేలం పాటకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు.
1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం కొనసాగుతోంది. ఏటా దీని ధర లక్షల్లో పెరుగుతూనే ఉంది. 2016 నుంచి వేలం పాట అమాంతం రెట్టింపు అయింది. వచ్చే ఏడాది బాలాపూర్ లడ్డూ 20లక్షల మార్క్ చేరుకోవడం గ్యారెంటీ అంటున్నారు నిర్వహకులు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ కానుకగా వెళ్లబోతోంది. కేవలం జగన్ కు కానుకగా ఇచ్చేందుకే ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొన్నట్టు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రకటించారు. త్వరలోనే జగన్ చేతికి లడ్డూని అందించబోతున్నారు.