‘వినాశకాలే విపరీత బుద్ధి!’ …ఇదీ ఆర్కే ఈ వారం రాసిన కొత్త పలుకు సారాంశం. సహజంగానే ఆర్కే కొత్తపలుకులో ఏం రాసి ఉంటారో, ఎలా రాసి ఉంటారో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ ఉనికినే ఆయన సహించడం లేదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, నేడు పాలక పక్షంలో ఉన్నా …ఆర్కే లక్ష్యం మాత్రం ఆయన్ను బద్నాం చేయడమే.
ఈ క్రమంలో తానెంతగా బద్నాం అయ్యాడో ఆర్కే తెలుసుకునే స్థితిలో లేడు. జగన్‌పై ద్వేషం ఆర్కేలో విచక్షణను చంపేసింది. చంద్రబాబు, ఆయన సామాజిక వర్గంపై ప్రేమ , ఆరాధన …ఇతర సామాజిక వర్గాలను ద్వేషించేంత అంధత్వాన్ని పెంచింది. ఇది ఎవరూ కాదనలేని సత్యం.
నిజంగా ఆర్కేలో ఏ మాత్రం నీతి, నిజాయితీ ఉన్నా … నేడు ఇంత దిగజారి, దిగంబరంగా రాతలు రాసే స్థాయికి దిగజారి ఉండేవాడు కాదు. తాజా కొత్తపలుకులో ఆర్కే రాతలను చదివితే … థూ, అని అసహ్యించుకోకుండా ఉండలేరు. ఎందుకంటే సమాజాన్ని, సత్యాన్ని ప్రేమించే ఏ మనిషైనా, మనసైనా అదే పని చేస్తుంది. చేయాలి కూడా. అలా చేయకపోతే చివరికి మనం ఆర్కేలా మానవత్వం, విచక్షణ లేని మానవ రూపంలో ఉన్న మరే ప్రాణిగానో మిగలాల్సి వస్తుంది.
జగన్‌ను ద్వేషించే క్రమంలో ఆర్కే పాతాళానికి అడుగున మరేదైనా ఉంటే అక్కడి వరకు దిగజారారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వేళ న్యాయ వ్యవస్థకు ఒక దిక్సూచిలా భావించే ప్రశాంత్ భూషణ్‌పై ఆర్కే తిట్ల దండకానికి దిగారంటే …ఆర్కే పతనావస్థ గురించి మాటలు, రాతలు చాలవు. అయితే ఆర్కే నుంచి ఇంతకంటే ఆశించడం అంటే అతిశయోక్తే అవుతుందని జర్నలిస్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
బురదలో పొర్లాడే పందికి సెంటు వాసన గురించి ఏం తెలుసు? ప‌్రశాంత్ భూషణ్ వ్యక్తిత్వం, ఆచరిస్తున్న విలువల గురించి తెలిసినా, తెలియకపోయినా , ఆయనంటే ఓ ఆరాధన భావంతో చూస్తారు.
సమాజంలో కొన్ని పర్సనాలిటీలు అంతే. మహాత్మాగాంధీని ఇప్పటి మన దేశ ప్రజలు ఎంత మంది చూశారు? కానీ ఆయనంటే ఎందుకంత గౌరవం, ఆరాధన? మనం ఈ వేళ స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించగలుగుతున్నామంటే ఆయన సారథ్యంలో నడిచిన పోరాట ఫలితమే అని అందరూ నమ్ముతారు. కానీ గాంధీని చంపిన గాడ్సేను పొగుడుతున్న కాలానికి ఆర్కే ఓ ప్రతీక.
ఈ రోజు ఆర్కే వ్యాసంలో రాసిన ఆణిముత్యాల్లాంటి వాక్యాలను ఒకసారి పరిశీలించి ఆర్కే స్థాయి ఏ పాటిదో తెలుసుకుందాం.
‘భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావలసి ఉన్న జస్టిస్ రమణపై జగన్ చేసిన ఫిర్యాదును న్యాయవాదుల సంఘాలతో పాటు పలువురు న్యాయ నిపుణులు తీవ్రంగా తప్పుబట్టారు. జగన్మోహన్ రెడ్డి చర్యను కేవలం ఇద్దరు మాత్రమే సమర్థించారు. వీరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ ఏకే గంగూలీ ఒకరు. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఇటీవల శిక్ష పడిన ప్రశాంత్ భూషణ్ రెండో వ్యక్తి. రిటైర్డ్ జస్టిస్ గంగూలీ తనపై ఒక యువతి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ చేయకూడదని అభ్యంతరం చెప్పడం గమనార్హం’
జగన్ లేఖ రాయడాన్ని తప్పుబట్టిన ఢిల్లీ న్యాయవాదుల సంఘం నాయకుడి బాగోతం ఏంటో దేశమంతా చూసింది. రూ.200 కోట్లకు పైబడి కేసులో ఐటీ సోదాల్లో పట్టుబడిన వ్యక్తి ఆర్కే దృష్టిలో గొప్ప న్యాయ కోవిదుడా? అయినా ఎన్ని పుంగనూర్లైతే ఒక బెంగళూరుకు సాటి? న‌్యాయవాదుల్లో ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్లు ఒక్కరు చాలదా జగన్ లేఖను సమర్థించడానికి?
జగన్‌మోహన్‌రెడ్డి లేఖను కేవలం ఇద్దరు మాత్రమే సమర్థించారని ఆర్కే తక్కువ చేసి చూపడం ఆయనకే చెల్లింంది. ఈ వేళ న్యాయ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చీమ చిటుక్కుమన్నా ప్రశాంత్ భూషణ్ స్పందన కోసం యావత్ దేశమంతా ఎదురు చూస్తున్న విషయాన్ని విస్మరించకూడదు. జస్టిస్ ఏకే గంగూలీ, ప్రశాంత్ భూషణ్‌ల గురించి ఎంత చులకన భావమో ఆయన రాతలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఇటీవల శిక్ష పడిన ప్రశాంత్ భూషణ్ అని రాయడం వెనుక ఆర్కే ఉద్దేశం ఏంటి? ఆకాశాన ఉమ్మేయాలనే తపన ఆర్కేలో కనిపించింది. ప్రశాంత్ భూషణ్ పేరు ప్రస్తావించే కనీస నైతిక అర్హతైనా ఆర్కేకు ఉందా?
యూపీఏ-2 పాలనలో నీరా రాడియా టేప్ కేసు, బొగ్గు గనులు, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాల లాంటి కేసులను ప్రశాంత్ భూషణ్ లెవనెత్తారు. 2జీ కేసు ఫలితంగా అప్పటి టెలికాం మంత్రి రాజీనామా చేయడంతోపాటు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.
అలాగే సుప్రీంకోర్టు స్పెక్ట్రమ్, బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేసింది. ఈ కేసులపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఫలితంగా కొన్ని టెలికాం సంస్థలు భారీగా నష్టపోయాయి. ప్రశాంత్ భూషణ్ పిటిషన్ వేసిన తర్వాత గోవాలో ఇనుప ఖనిజం మైనింగ్‌ను కోర్టు నిలుపుదల చేసింది. ఇది మన దేశానికి ప్రశాంత్ కాంట్రిబ్యూషన్.
ఆ తర్వాత మోడీ ప్రభుత్వంలో రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం, కోవిడ్ లాక్‌డౌన్ వల్ల కార్మికుల ఇబ్బందులు, పీఎం కేర్స్ ఫండ్‌కు సంబంధించి పారదర్శకతలో లోపాలకు సంబంధించి కూడా ప్రశాంత్ భూషణ్ న్యాయ పోరాటం చేశారు. వేలాది ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలు వేసి పౌరుల హక్కులను కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు, చేస్తున్నారు. వేలాది మంది పేదల కేసులను వాదించేందుకు డబ్బు తీసుకోకుండా తన నిబద్ధతను, సమాజం పట్ల బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న లాయర్‌గా దేశం గుర్తించింది. అలాంటి న్యాయవాది తన బిడ్డ కావడాన్ని భరతమాత గర్విస్తోంది.
ఇటీవల కోర్టు ధిక్కరణ కేసు విచారణలో భాగంగా క్షమాపణలు చెబితే తప్పేంటని పదేపదే ప్రశ్నించిన జస్టిస్ మిశ్రా.. దీనిపై ఆయన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయాన్ని కోరారు. దీనికి అటార్నీ జనరల్ స్పందిస్తూ.. హెచ్చరించి, మందలించి వదిలేయాలని, ఆయనకు శిక్ష విధించాల్సిన అవసరం లేదని బదులిచ్చారు.
ప్రశాంత్ భూషణ్ అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి, ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని అభ్యర్థించారు. అందరూ కోర్టును విమర్శిస్తూ ఆయనను సమర్థిస్తున్నారు, మా అంతట మేం ఆయన వ్యాఖ్యలను తొలగించడమేంటని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించిన విషయాన్ని విస్మరించొద్దు.
ఇదీ ప్రశాంత్ భూషణ్ గొప్పతనం. సాక్ష్యాత్తు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అందరూ కోర్టును విమర్శిస్తూ, ఆయన్ను సమర్థిస్తున్నారని వ్యాఖ్యానించారంటే ప్రశాంత్ భూషణ్‌పై ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో కార్పొరేట్లకు, చంద్రబాబుకు ఊడిగం చేసే ఆర్కేకు అర్థం కాదు.
ఆర్కే దృష్టిలో కోర్టు ధిక్కరణ నేరమైతే ప్రశాంత్ భూషణ్ పెద్ద నేరస్తుడే. ఆ నేరాన్ని ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘న్యాయ వ్యవస్థ నిష్కళంక చరిత్ర పక్కదారి పడుతూంటే ఆ విషయంపై గళమెత్తడం న్యాయవాదిగా నా బాధ్యత. ఆ కారణంగానే మంచి విశ్వాసంతోనే నా భావాలను వ్యక్తం చేశాను. సుప్రీంకోర్టుకు లేదా ఏ ప్రధాన న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదించాలన్నది నా ఉద్దేశం కాదు. రాజ్యాంగ ధర్మకర్తగా, ప్రజల హక్కులను కాపాడే న్యాయవ్యవస్థ తప్పుదోవ పట్టరాదని సద్విమర్శ మాత్రమే చేశాను.
క్షమాపణ మాటవరసకు చేసేదిగా కాకుండా నిజాయితీగా ఉండాలని న్యాయస్థానమే చెబుతుంది. దేశంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఉన్న చిట్టచివరి ఆశ సుప్రీంకోర్టే ’ అని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో ప్రశాంత్ భూషణ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
ఇలాంటి మహోన్నత వ్యక్తి జగన్ లేఖను సమర్థించడంతో పాటు నిజాయితీపరులైన రిటైర్డ్ జడ్జీలతో విచారణ జరిపించాలని కోరాడనే అక్కసుతో ఆర్కే ఎంత మాటన్నాడో తెలుసుకుందాం.
‘అమరావతిని రాజధానిగా 2014లో ప్రకటిస్తే, 2015 జూన్‌లో జస్టిస్ రమణ కూమార్తెలు అక్కడ కొంత భూమి కొనుక్కున్నారు. ఈ కొనుగోలు ప్రక్రియ ఏ చట్టం కింద నేరమవుతుందో జగన్ చర్యలను సమర్థించేవారితో పాటు జగన్ లేఖపై విచారణ జరపాలని కోరుతున్న వారు చెప్పాలి. అయినా జగన్ చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని కొంతమంది న్యాయ నిపుణులు కోరడం వింతగా ఉంది. న్యాయవ్యవస్థలో పనిచేసిన వారు కొందరు అదే న్యాయ వ్యవస్థను చెరబట్టాలనుకునే వారి వైపు నిలబడాల నుకోవడం నిజంగా విషాదం’
ఆర్కే ఎంతగా బరి తెగించాడో ఈ వాక్యాలే నిదర్శనం. అయినా రాజధానిలో అవినీతే జరగలేదంటూ పరిశోధనాత్మక కథనాలు రాసే ఆర్కేకు , భారీ కుంభకోణాలపై పోరాడే ప్రశాంత్ భూషణ్ అంటే కోపం ఉండడంలో అర్థం ఉంది. ఎందుకంటే మంచి అంటే చెడుకు ఎప్పుడూ పడదు. సామాన్య ప్రజల హక్కులను కాపాడే వ్యవస్థగా న్యాయ వ్యవస్థ ఉండాలని పరితపిస్తూ, ఆ క్రమంలో దాన్నే నమ్ముకుని పోరాడే ప్రశాంత్ భూషణ్ ఎక్కడ? అక్షరాల్ని అమ్ముకుని కార్పొరేట్లకు, చంద్రబాబుకు ఊడిగం చేసే ఆర్కేకు పోలిక ఎక్కడ? నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా!
స్వాతంత్ర్యానికి పూర్వం భరతమాత వీరులను కన్నదని, స్వాతంత్ర్యానంతరం పురుగులు కన్నదని ఓ కవి అన్నమాటల్లో రెండో మాట విన్నప్పుడు ఆర్కే గుర్తుకొస్తే తప్పెవరిది? ఇలాంటి సోకాల్డ్ జర్నలిస్టులు తమకు కావాల్సిన వ్యక్తులను, వ్యవస్థలను కాపాడుకునేందుకు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజలు తెలివిగా తిప్పికొట్టగలిగే వివేకవంతులు.
ప్రశాంత్ భూషణ్ అనే న్యాయ కోవిదుడు జగన్‌ను వ్యక్తిగా వెనకేసుకు రావడం లేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు చేసిన ఫిర్యాదుపై మాత్రమే ఆయన స్పందించారు. ఎందుకంటే ఆ ఫిర్యాదులో చేసిన ఆరోపణలు న్యాయ వ్యవస్థకు మలినం అంటేలా ఉన్నాయనేది ప్రశాంత్ భూషణ్ బాధ, ఆవేదన.
ఆ మాత్రం దానికే ప్రశాంత్ భూషణ్‌తో పాటు జగన్ లేఖ రాయడాన్ని సమర్థించే వాళ్లందరినీ దుష్టలు, దుర్మార్గాలు అంటూ తిట్ల దిండకానికి దిగడం ఒక్క ఆర్కేకు మాత్రమే చెల్లు. ఎందుకంటే ఆయనకు ఏ విలువలూ లేవు కాబట్టి. అన్నీ వదిలేసిన సన్నాసి … ఎవరినైనా, ఏమైనా మాట్లాడేందుకు వెనుకాడరు కాబట్టి.