భారత్ -చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. చైనా దుందుడుకుతనంతో వ్యవహరిస్తే భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పొరుగు దేశం చైనాకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొంది. దీంతో సోషల్ మీడియాకు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకొంది. ఈ దెబ్బతో చైనాకు సంబంధించి 59 యాప్‌లను నిషేధించింది.
వీటిలో మన దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన టిక్‌టాక్ ఒకటి. మోడీ సర్కార్ తీసుకున్న యాప్‌ల నిషేధ నిర్ణయంతో ఆ సంస్థల ఆర్థిక వ్యవస్థలు తలకిందులు కావాల్సి వచ్చింది. ఒక్క టిక్‌టాక్‌కు కలిగిన నష్టమే వేల కోట్లలో ఉంది. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ ఏకంగా రూ.45 వేల కోట్ల మేర నష్టపోనున్నట్టు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్' స్పష్టం చేసింది.
దీంతో టిక్‌టాక్ సంస్థ లబలబలబమని గుండెలు బాదుకుంటోంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడం అంత సులభం కాదని వాపోతోంది. ఎందుకంటే ప్రపంచంలోనే చైనాకు భారత్ అతిపెద్ద మార్కెట్. అలాంటిది అనవసరంగా దేశ సరిహద్దుల్లో హద్దులు దాటి ప్రవర్తిస్తూ చేజేతులారా తమ ఆర్థిక వ్యవస్థల్ని కూలదోసుకుంటోందనే వాదన వినిపిస్తోంది.