ప్ర‌తిప‌క్షాల ఆశ‌లు అడియాస‌లే!

తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు చురుగ్గా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు అధికార పార్టీ అరాచ‌కాల‌కు పాల్ప‌డిన నేప‌థ్యంలో తిరిగి ఉప ఎన్నిక జ‌రుగుతుంద‌నే ప్ర‌తిప‌క్షాల ఆశ‌లు అడియాస‌లైన‌ట్టే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వు తున్నాయి. …

తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు చురుగ్గా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు అధికార పార్టీ అరాచ‌కాల‌కు పాల్ప‌డిన నేప‌థ్యంలో తిరిగి ఉప ఎన్నిక జ‌రుగుతుంద‌నే ప్ర‌తిప‌క్షాల ఆశ‌లు అడియాస‌లైన‌ట్టే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వు తున్నాయి. 

తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసుకుని అక్ర‌మాల‌కు అధికార పార్టీ తెర‌లేపింద‌ని, విచారించి న్యాయం చేయాల‌ని ఇటు బీజేపీ అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇదే సంద‌ర్భంలో టీడీపీ, బీజేపీ నేత‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.

అయితే ఇటు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి, అటు హైకోర్టు నుంచి ఎలాంటి స్పంద‌న క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు కౌంటింగ్ ప్ర‌క్రియ‌పై నెల్లూరు క‌లెక్ట‌ర్‌, తిరుప‌తి ఎన్నిక‌ల రిటర్నింగ్ అధికారి కేవీఎన్ చక్ర‌ధ‌ర్‌బాబు స‌హాయ రిటర్నింగ్ అధికారులు, త‌హ శీల్దార్లకు శిక్ష‌ణ ఇచ్చారు. ఎలాంటి ఆరోప‌ణ‌ల‌కు తావు లేకుండా కౌంటింగ్ చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు.
 
చిత్తూరు జిల్లాలోని మూడు నియోజ‌క వ‌ర్గాల‌కు తిరుప‌తిలో, నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజ‌క వ‌ర్గాల కౌంటింగ్ నెల్లూరులో జ‌రుగుతుంద‌న్నారు. కోవిడ్ దృష్ట్యా కౌంటింగ్ హాళ్ల‌ను పెంచిన‌ట్టు ఆయ‌న తెలిపారు. 

తిరుప‌తిలో అక్ర‌మాల‌పై ప్ర‌తిప‌క్షాలు ఫిర్యాదు లు చేయ‌డం, వాటిపై విచారించి నివేదిక స‌మ‌ర్పించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తిరుప‌తి ఎన్నిక‌ల రిటర్నింగ్ అధికారి కేవీఎన్ చక్ర‌ధ‌ర్‌బాబును ఆదేశించిన సంగ‌తి తెలుసు.

దీనిపై చ‌క్ర‌ధ‌ర్‌బాబు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నివేదిక స‌మ‌ర్పించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఆయ‌నే కౌంటింగ్ ప్ర‌క్రియ‌కు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న నేప‌థ్యంలో, అనుమానాల‌కు ఫుల్‌స్టాప్ ప‌డిన‌ట్టైంది. ప్ర‌తిప‌క్షాలు ఆశిస్తున్న‌ట్టు వారు ఆశించిన‌ట్టు ఏదీ జ‌రిగేలా క‌నిపించ‌లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.