జ‌గ‌న్ స‌ర్కార్‌లో…ఏందీ మొండిత‌నం?

కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప‌రిస్థితుల్లో త‌మ మొర ఆల‌కించాల‌ని రాష్ట్ర స‌చివాల‌య ఉద్యోగులు వేడుకుంటున్నారు. ఇప్పటికే స‌చివాల‌య ఉద్యోగుల్లో 100 మంది వ‌ర‌కూ క‌రోనా బారిన ప‌డిన‌ట్టు స‌మాచారం. అలాగే ఐదుగురు ఉద్యోగులు…

కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప‌రిస్థితుల్లో త‌మ మొర ఆల‌కించాల‌ని రాష్ట్ర స‌చివాల‌య ఉద్యోగులు వేడుకుంటున్నారు. ఇప్పటికే స‌చివాల‌య ఉద్యోగుల్లో 100 మంది వ‌ర‌కూ క‌రోనా బారిన ప‌డిన‌ట్టు స‌మాచారం. అలాగే ఐదుగురు ఉద్యోగులు మృత్యువాత ప‌డ‌డంతో స‌చివాల‌య ఉద్యోగుల్లో భ‌యాందోళ‌న నెల‌కుంది. మృతుల్లో దంప‌తులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

నాలుగు రోజుల క్రితం ఏపీ స‌చివాల‌యం ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు కె.వెంక‌ట్రామిరెడ్డి నేతృత్వంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. క‌రోనాతో ఉద్యోగులు ప్రాణాలు గాలిలో క‌లిసిపోతున్నాయ‌ని, దీంతో ఉద్యోగుల్లో భ‌యాందోళ‌న నెల‌కుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒక వైపు విధి నిర్వ‌హ‌ణ‌, మ‌రోవైపు మ‌హమ్మారి ఏం చేస్తుందేన‌నే ఒత్తిడికి ఉద్యోగులు గురి అవుతున్నారు.

విప‌త్క‌ర ప‌రిస్థితిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వ‌ర్క్ ఫ్రం హోం అవ‌కాశం క‌ల్పించాల‌ని ఉద్యోగుల ప్రాణాలు కాపాడాల‌ని వారు కోరుకుంటున్నారు. క‌నీసం వారం పాటు అంద‌రికీ work from home ఇచ్చి, ఆ తర్వాత 50 శాతం ఉద్యోగులకు రొటేషన్ పద్దతిలో work from home ఇవ్వాలి అని స‌చివాల‌య ఉద్యోగులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. 

ఇదే క‌రోనాను చూపి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను అడ్డుకునేందుకు ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌ను ముందుకు తెచ్చిన ప్ర‌భుత్వం, ఇప్పుడు నిజంగానే మ‌హమ్మారి విల‌య తాండవం సృష్టిస్తుంటే, వారి భ‌యాందోళ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఉదాసీన‌త‌పై స‌చివాల‌య ఉద్యోగుల్లో అస‌హ‌నం, ఆగ్ర‌హం పెరిగిపోతున్నాయి. జ‌గ‌న్ స‌ర్కార్‌లో ఎందుకీ మొండిత‌నం అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. వీటికి ప్ర‌తిప‌క్షాలు వంత పాడుతుండ‌డం గ‌మ‌నార్హం. 

క‌రోనా క‌ట్ట‌డికి చాలా విష‌యాల్లో ప‌క‌డ్బందీ చ‌ర్య‌ల‌తో ముందుకెళుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌చివాల‌య ఉద్యోగుల ఆందోళ‌నను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకపోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఎటూ ఈ రోజు కాకుంటే, రేపైనా స‌చివాల‌య ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం అవ‌కాశాల‌న్ని క‌ల్పించాల్సిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

ఇంకా త‌మ‌లో ఎంత మంది చ‌స్తే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి జ్ఞానోద‌యం అవుతుంద‌నే ఆక్రోశం స‌చివాల‌య ఉద్యోగుల నుంచి వ్య‌క్త‌మవుతోంది. అలాంట‌ప్పుడు చెడ్డ పేరు తెచ్చుకున్న త‌ర్వాత మేల్కోవ‌డం కంటే, అదేదో ముందే త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటే బాగుం టుంది క‌దా అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.