‘మహిళలను గౌరవించండి. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వండి’ అని బస్సుల్లో రాసి ఉండడాన్ని ఎన్నో సార్లు చూసి ఉంటాం. అలాగే ‘మహిళలు ఎక్కడ గౌరవించబడుతారో అక్కడ దేవతలు ఉంటారు. కావున వారిని గౌరవిద్దాం’ అని బస్సుల్లో రాసిన వాటిని అనేక మార్లు చదివి ఉంటాం. మహిళలకు ఆర్టీసీ ఇచ్చే గౌరవం అలాంటిది.
కానీ తమిళనాడులోని కోయంబత్తూరు ఆర్టీసీ రీజియన్ పరిధిలో సంబంధిత అధికారులు ఓ విచిత్రమైన నిబంధన విధించారు. ఇప్పుడు ఆ నిబంధనపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆ నిబంధన కూడా డ్రైవర్లకు మాత్రమే.
ఆర్టీసీ డ్రైవర్లకు సమీపంలో ఉండే సీట్లలో మహిళలు కూర్చుంటే వారితో వాహనం నడిపే వాళ్లు మాట్లాడకూడదని నిబంధన విధించారు. ఎందుకయ్యా ఈ నిబంధన అని కోయంబత్తూరు ఆర్టీసీ రీజియన్ అధికారులను ప్రశ్నించగా…చావు కబురు చల్లగా చెప్పారు. మహిళలతో మాట్లాడుతూ బస్సు నడుపుతుండటం వల్ల డ్రైవింగ్‌పై ఏకాగ్రత కొరవడి, వేరే లోకంలో విహరిస్తూ ప్రమాదాలు చేస్తున్నారనే ఫిర్యాదులు తమకు అందాయంటున్నారు. డ్రైవర్లు పరధ్యానంతో బస్సులు నడుపుతూ ప్రాణాలు తీస్తున్నారని ఆర్టీసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్లే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కోయంబత్తూరు ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఈ నిబంధన అతిక్రమించే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు హెచ్చరిస్తున్నారు.