ఇలాంటి రాజకీయాలకు కాలం చెల్లిపోయిందనే విషయాన్ని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నట్టుగా ఉన్నారు జేసీ కుటుంబీకులు. అటు జేసీ బ్రదర్స్, ఇటు జేసీ సన్స్.. ఎప్పుడో 80ల నాటి రాజకీయమే చేస్తూ ఉన్నారు. అయితే మొన్నటి వరకూ జేసీలు ఏం చేసినా చెల్లింది. కానీ.. ఇప్పుడు అతి చేస్తే సహించేది లేదని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలే ఇస్తోంది. అయినా తమ ఇమేజ్ నేదో కాపాడుకోవాలని..జేసీలు ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారు. ఈ క్రమంలో వాళ్లు వరసగా జైలు పాలవ్వడం మాత్రం తప్పడం లేదు!
ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి రెండు పర్యాయాలు జైలుకు వెళ్లి వచ్చారు. ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి ఒక సారి తండ్రితో పాటు జైలుకెళ్లొచ్చారు. ఆ అనుభవాలను యూట్యూబ్ చానళ్లతో పంచుకుంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మరి వాళ్లకే ఎక్కువ పేరొస్తుందని అనుకుంటున్నారో ఏమో కానీ.. జేసీ పవన్ రెడ్డి కూడా ఒకసారి అరెస్టయ్యారు. వీళ్లంతా న్యూసెన్స్ తరహా కేసుల్లో వరసగా జైలుకు వెళ్తూ ఉండటం గమనార్హం.
ముందుగా ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లు ట్రావెల్ బస్సుల అక్రమాల కేసులో జైలుకు వెళ్లారు. కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో జైలు నుంచి విడుదల అవుతూ.. వాళ్లు హల్చల్ చేశారు. కడప జైలు నుంచి తాడిపత్రికి భారీ హంగామా మధ్యన చేరుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉన్న నియమాలను ఉల్లంఘించారు. వారించిన పోలీసులను కులం పేరుతో దూషించి ప్రభాకర్ రెడ్డి వెంటనే మళ్లీ అరెస్టయ్యారు. అలా బెయిల్ మీద బయటకు రావడం, ఆ వెంటనే అరెస్టు కావడం జరిగింది ప్రభాకర్ రెడ్డి.
రెండోసారి జైలుకు వెళ్లినప్పుడు ఆయన కరోనాకు గురయ్యారు. చికిత్స చేయించుకోవడానికి అంటూ విడుదల అయ్యారు. ఆ తర్వాత కూడా జేసీల తీరు పెద్దగా మారినట్టుగా లేదు.
గత వారంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి అనంతపురంలో హల్చల్ చేశారు. మైనారిటీలపై దాడులకు నిరసనగా ఈయన ఒక బైక్ ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేశారు. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో.. నిబంధనల ప్రకారం రాజకీయ ర్యాలీలు వంటి వాటికి అనుమతి అవసరం. అయితే తాను జేసీ పవన్ కాబట్టి.. అలాంటిది అసవరం లేదని పవన్ హల్చల్ చేశారు. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. కేసులు నమోదు చేశారు!
కడప జైలు నుంచి బయటకు వచ్చాకా ప్రభాకర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో.. కడప జైలు చాలా భేషుగ్గా ఉందని కితాబిచ్చారు. వారానికి రెండ్రోజులు చికెన్ పెడతారని, మంచి వాతావరణం అన్నట్టుగా వివరించారు.
అరెస్టు అయిన వారెవరైనా కడప జైలుకు వెళ్లాలని కూడా ఉచిత సలహా ఇచ్చేశారు. జైలు జీవితంపై ప్రభాకర్ రెడ్డి అలా మమకారాన్ని చాటుకున్నారు. తన బాబాయ్ అంతగా చెప్పే సరికి జేసీ పవన్ ఆగలేక.. చూసొద్దామన్నట్టుగా అరెస్టయ్యారో ఏమో!
వీళ్లు వరసగా కావాలని అరెస్టు అయినట్టుగా వ్యవహరిస్తున్న తీరును గమనించి.. జేసీలకు ఇళ్లు కన్నా జైలే బాగున్నట్టుందే అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.