తిరుప‌తి వైఎస్సార్సీపీ భారం ఆ ముగ్గురి మీదే ఎక్కువ‌?

తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్ర‌తిష్టాత్మ‌క‌మే. అటు నెల్లూరు జిల్లా, ఇటు చిత్తూరు జిల్లాలో విస్త‌రించిన ఈ నియోజ‌క‌వ‌ర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌న ప‌ట్టు…

తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్ర‌తిష్టాత్మ‌క‌మే. అటు నెల్లూరు జిల్లా, ఇటు చిత్తూరు జిల్లాలో విస్త‌రించిన ఈ నియోజ‌క‌వ‌ర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌న ప‌ట్టు నిరూపించుకోవాల్సి ఉంది. 

ఆది నుంచి తిరుప‌తి లోక్ స‌భ సీటు కాంగ్రెస్- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల‌కే అనుకూలంగా నిలుస్తూ వ‌స్తోంది.  ఇక్క‌డ టీడీపీ ఒకే ఒక్క‌సారి గెలిచింది. 1999లో మాత్రం టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి ద‌క్క‌గా.. ఆ పార్టీ నెగ్గింది. మిగ‌తా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ వ‌రస విజ‌యాలు సాధించింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతోనే 2014లో ఈ సీటును సొంతం చేసుకుంది. 2019లో మరింత భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సీటును నిల‌బెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో అనూహ్యంగా వ‌చ్చిన ఉప ఎన్నిక‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప‌రీక్షే ఎదుర‌వుతోంది. 

ప్ర‌త్యేకించి ప్ర‌తిప‌క్షాలు నిస్పృహ‌తో ఏమీ లేవు. అనుకూల మీడియాతో తెలుగుదేశం ఇంకా ఉనికిలో ఉంది. ఇక బీజేపీ అత్యుత్సాహంతో ఉంది. జ‌న‌సేన దానికి తోడుగా నిలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మారిన స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుప‌తి ఉప ఎన్నిక‌ను ఎదుర్కొనాల్సి వ‌స్తోంది.

ఈ ఉప ఎన్నిక చిత్తూరు జిల్లాలోని ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు పెద్ద ప‌రీక్ష కాబోతోంద‌ని స్ప‌ష్టం అవుతోంది. వారే మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి. వీరిలో భూమున తిరుప‌తి ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరుప‌తి కేంద్ర‌మైన లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో భూమ‌న కు చేతినిండా ప‌ని ఉన్న‌ట్టే.

ఎమ్మెల్యేగా భూమ‌న వ్య‌వ‌హార శైలి పూర్తి భిన్నంగా సాగుతూ ఉంది. దూకుడైన రాజ‌కీయం కాకుండా.. ప‌రిణ‌తితో కూడిన రాజ‌కీయం సాగుతూ ఉంది. ఇక భూమ‌న త‌న‌యుడు నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉన్నారు. క్యాడ‌ర్ తోనూ, ప్ర‌జ‌ల‌తోనూ సత్సంబంధాల‌ను నెరుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆ సానుకూల స్పంద‌న ఉంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఇక‌ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాల్లోనూ పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల‌ను ప్ర‌భావితం చేసే స్థితిలో ఉంది. ఈ నేప‌థ్యంలో.. వీరిపై కూడా తిరుప‌తి లోక్ స‌భ సీటు ఉప ఎన్నిక బాధ్య‌త‌లు ప‌డ‌బోతున్నాయి.

తిరుప‌తి లోక్ స‌భ సీటుకు ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కాక‌పోయినా.. చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డికి కూడా తిరుప‌తి బై పోల్ బాధ్య‌తలు బాగానే ఉంటాయ‌ని స్ప‌ష్టం అవుతోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చాకా.. నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో చెవిరెడ్డి అగ్ర‌తాంబూలు అందుకుంటున్నారు. 

2019 ఎన్నిక‌ల‌కు ముందు చెవిరెడ్డికి ఆ త‌ర్వాత చెవిరెడ్డికి స్ప‌ష్ట‌మైన తేడా ఉంది. ఇప్పుడు సొంత నియోజ‌క‌వ‌ర్గమే గాక‌.. చిత్తూరు జిల్లాలో కూడా ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం అవుతోంది.

పవన్ కు ఒక నీతి.. ప్రకాష్ రాజ్ కు మరో నీతి