సినిమా టికెట్ల ధరలతో పాటు మరికొన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపుతూ ఏపీ ప్రభుత్వం రెండు రోజుల క్రితం జారీ చేసిన జీవోపై టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదట మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.
ఆ తర్వాత తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి మీడియా సమావేశం నిర్వహించి జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌ను సన్మానించేందుకు చిరంజీవిని కలుస్తామని అన్నారు. ఇకపై చిరంజీవే టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిగ్గజ దర్శకుడు రాజమౌళి, అలాగే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. వీళ్లిద్దరు కూడా చిరంజీవితో పాటు సీఎంను కలిసిన సంగతి తెలిసిందే.
'కొత్త జీవోతో టికెట్ల ధరలు సవరించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సహాయం చేసినందుకు ఏపీ సీం జగన్ గారికి, మంత్రి పేర్ని నాని గారికి ధన్యవాదాలు. ఇది సినిమాల పునరుద్ధరణకు ఎంతో సహాయపడుతుందని ఆశిస్తున్నాను' అని రాజమౌళి రాసుకొచ్చారు. మహేశ్‌బాబు స్పందన ఏంటో చూద్దాం.
'కొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్ల ద్వారా మా సమస్యలను విని పరిష్కరించినందుకు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని తెలిపారు. అలాగే, 'పేర్ని నాని గారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మధ్య పరస్పర బలమైన, ఆరోగ్యకరమైన సహకారం కోసం మేము ఎదురు చూస్తున్నాం ' అని మహేశ్‌బాబు పేర్కొన్నారు.
వైఎస్ కుటుంబంతో మహేశ్‌బాబు కుటుంబానికి మంచి స్నేహసంబంధాలున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై టాలీవుడ్ సంతృప్తిగా లేదనే ప్రచారానికి ప్రముఖుల ట్వీట్లు చెక్ పెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా జీవోతో సినీ పరిశ్రమకు కలిగే ప్రయోజనాలు శూన్యమని, సీఎం జగన్‌పై టాలీవుడ్ ఆగ్రహంగా ఉందనే దుష్ప్రచారాన్ని ఓ వర్గం మీడియా పనిగట్టుకుని చేస్తున్న సంగతి తెలిసిందే.