రాజకీయాల్లో విభిన్నమైన నేతలు జేసీ బ్రదర్స్ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి. మనసులో తాము అనుకుంటున్నారో అదే బయట పెట్టడం వారి లక్షణం. చాలా సందర్భాల్లో వారి మాటలు వివాదానికి దారి తీశాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకుండా, తమ వారసులను నిలిపారు. వైసీపీ నేత జగన్ హవా ముందు, జేసీ వారసులు కూడా కొట్టుకుపోయారు.
ఇవాళ తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి జేసీ దివాకర్‌రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా మరోసారి ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేసీఆర్‌పై ప్రశంసలు, ఏపీ సీఎం జగన్‌పై సెటైర్స్ విసిరారు. తెలంగాణలో ఒకేసారి 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని అభినందించారు. దేశంలో మరెక్కడా ఇలా జరగలేదన్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రకటనతో యూత్‌లో సీఎం కేసీఆర్‌కు మంచి క్రేజ్ వస్తుందని కొనియాడారు.
ఇక ఏపీ సీఎం జగన్‌పై కూడా ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. మూడు కాకుంటే పది రాజధానులను ఏపీలో పెట్టుకోవచ్చన్నారు. అది తమ సీఎం జగన్ ఇష్టమన్నారు. మంత్రి బొత్స ఇప్పటికీ హైదరాబాదే తమ రాజధాని అన్న వ్యాఖ్యలపై ఆయన చలోక్తులు విసిరారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ హైదరాబాద్ రావాలని అనుకుంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. తమకు ఇంకా రెండేళ్లు హైదరాబాద్‌లో ఉండేందుకు హక్కు ఉందన్నారు. అందుకే వాడుకోవాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటున్నట్టు జేసీ వ్యంగ్యంగా అన్నారు.