ఎమ్మెల్సీ కరీమున్నీసా ఆకస్మిక మృతితో ఏర్పడిన ఖాళీని మైనార్టీ నాయకుడితోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భర్తీ చేశారు. అది కూడా మృతురాలి కుమారుడు ఎండీ రుహుల్లాను ఎంపిక చేయడంతో పాటు జగనే స్వయంగా ఫోన్ చేసి పిలిపించుకుని బీ ఫాం ఇవ్వడం విశేషం. తాడేపల్లిలో సీఎం జగన్ చేతుల మీదుగా బీఫాంను రుహుల్లా, ఆయన తండ్రి మహ్మద్ సలీమ్ అందుకున్నారు. కాబోయే ఎమ్మెల్సీ రుహుల్లాను సీఎం అభినందించారు.
విజయవాడలో డివిజన్‌స్థాయి నాయకురాలైన కరీమున్నీసాకు గతంలో ఎమ్మెల్సీగా జగన్ ఖరారు చేశారు. విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో నిలిచి, ప్రచారం చేస్తున్న కరీమున్నీసా దృష్టికి ఎమ్మెల్సీగా ఎంపికైన విషయాన్ని పార్టీ పెద్దలు తీసుకెళ్లారు. అయితే ఓ సాధారణ నాయకురాలైన తనకు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారంటే నమ్మలేకపోయానని ఆమె అప్పట్లో ఆనందంతో చెప్పారు.
కొంత కాలం క్రితం ఆమె హఠాన్మరణం చెందారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన కరీమున్నీసా సీటును ఆమె కుమారుడికి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడంతో వైసీపీ తన అభ్యర్థిగా ఎండీ రుహుల్లాను ఖరారు చేసింది.
సీఎం నుంచి బీ ఫాం అందుకున్న అనంతరం రుహుల్లా మీడియాతో మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన తల్లి కరీమున్నీసా మూడు నెలల క్రితమే చనిపోవడంతో ఖాళీ అయిన స్థానాన్ని సీఎం వైఎస్ జగన్ తనకు కేటాయించారన్నారు. సీఎం జగన్ ఫోన్ చేసి పిలిచి మరీ బీఫాం ఇచ్చారని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. గురువారం నామినేషన్ దాఖలు చేస్తానన్నారు. మైనార్టీలందరూ సీఎం జగన్‌కు రుణపడి ఉంటారన్నారు.