‘భారీ ఎత్తున కోళ్ల పందాలు – సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో సందడి’
పేపర్లో హెడ్‍లైన్సు తననే వెక్కిరించినట్టుగా ఫీలయ్యాడు అశ్వత్థామ. ‘‘చూశావా, వెళదామని చెప్తే మన క్లబ్బువాళ్లు ఒక్కళ్లూ వినలేదు. సిఎం యిసారి చాలా స్ట్రిక్టుగా వున్నాడు. ఇలాటి జూదాలు అనుమతించడు అంటూ పెద్ద ధర్మపన్నాలు వల్లించారు. చూడు ఏమైందో, వెళ్లి వుంటే ఓ లకారం కళ్ల చూసేవాణ్ని..’’ విసుక్కున్నాడు. నాగేంద్ర నవ్వాడు. ‘‘…కళ్ల చూసేవాడివో, దానికే కాళ్లు వచ్చేవో ఎవడు చూడొచ్చాడు! సరేలే, ఏదో ఒకలా పందాలు వేసి డబ్బు పోగొట్టుకోకపోతే నీకు చేయూరుకోదు. ఆ జూదమేదో, యిక్కడే మన క్లబ్బులోనే ఆడదాం. ఏదైనా థీమ్ ఆలోచించు.’’ అన్నాడు.
ఆ క్లబ్బుకి పేరేదో వుంది కానీ దాన్ని అందరూ పోతుటీగల క్లబ్బుగానే వ్యవహరిస్తారు. తినడం, పొర్లడం తప్ప పోతుటీగలు ఏ పనీ చేయనట్టే ఆ క్లబ్బు సభ్యులైన పిల్లజమీందార్లందరూ ఏ పనీ చేయరు. అందరూ మదించినవారే కానీ మదాల లెవెల్స్‌లో తేడా వుంది. పేకాట ఎప్పుడూ ఆడేదే కాబట్టి ఏదో రకమైన పందెం వేసి ఆ కొవ్వుని కరిగిద్దామని కొందరి తాపత్రయం. పెద్దలిచ్చే పాకెట్ మనీ గుఱ్ఱప్పందాల మీద పోగొట్టుకుని డబ్బుకోసం అనుక్షణం అలమటించే అశ్వత్థామది యిలాటి విషయాల్లో చురుకైన బుఱ్ఱ అని అందరూ మెచ్చుకుంటారు. అతని చూపు మళ్లీ పేపరు హెడ్‍లైన్స్ మీద పడింది. భారీ నుండి ‘భారీకాయం’ స్ఫురించింది.
‘‘ఆ, తట్టింది. బలిసిన కోళ్ల పందెంలా బలిసిన బాబయ్యల పందెం. మన మెంబర్లందరూ తలా ఐదు వేలూ వేసి పోటీలో పాల్గొనాలి. వాళ్ల వాళ్ల బాబయ్యల పేర్లు రాసి ఓ బుట్టలో పడేస్తాం. ఒక్కోళ్లూ ఒక్కో లాటరీ టిక్కెట్ తీయాలి. ఆ తర్వాత బాబాయిలను తూచాలి. ఏ బాబాయి ఐతే ఎక్కువ బరువు వుంటాడో లక్కీ డిప్‍లో ఆయన పేర ఉన్న టిక్కెట్ ఎవడి దగ్గరుంటే వాడికి లక్ష రూపాయల బహుమతి. బాబాయిలున్న వాళ్లే పోటీలో పాల్గొనాలి. సొంత బాబాయి లేకపోతే నాన్న కజిన్స్ అయినా ఫర్వాలేదు.. వాళ్లల్లో ఎవరు లావుగా వున్నారో చూసి వాళ్ల పేరు రాయించవచ్చు..’’
‘‘మీ నాన్న కజిన్ కృష్ణుడు గారు హెవీ వెయిట్ కదాని యీ క్లాజ్ పెట్టావా?’’ నాగేంద్ర కొంటెగా అడిగాడు.
‘‘ఇలాటి వెధవ బుద్ధులు నీకే వస్తాయి. ఎవరి బాబాయి భారీగా వుంటే వాళ్లకే ప్రైజు అనటం లేదు కదా, అలా అంటే వాళ్ల దగ్గరకెళ్లి బాగా మెక్కబెట్టి ఉగాది కల్లా గుమ్మాలు పట్టనంత సైజుకి తెచ్చేస్తారు. వేరేవాళ్ల బాబాయి పేరు మనకు వచ్చిందనుకో, మనమేం చేయగలం? అసలు వాళ్లు ఎలా వుంటారో కూడా తెలియదు కదా! మా బాబాయంటే మనకు జామీను యివ్వడానికి ఓ సారి వచ్చాడు కాబట్టి నువ్వు చూశావ్. తక్కినవాళ్ల సంగతి తెలియదు కదా…’’
‘‘చూడక్కర్లేదులే. మన బాబాయిలంతా మనకంటె బద్ధకస్తులు. ఏ పనీ చేయకుండా బాగా ఒళ్లు చేశారు. అయినా మన సొంత బాబాయి ఎలా వున్నా లాభం లేదు. మనకు తగిలిన టిక్కెట్ తాలూకు బాబాయి బొద్దుగా వుండాలి. ఓకే.. ఐడియా బాగానే వుంది కానీ, బాబాయి లందర్నీ ఓ చోట చేరిస్తేనే కదా సంగతి తెలిసేది..’’ అన్నాడు నాగేంద్ర.
‘‘కరక్ట్. అందుకని ఉగాది నాడు బాబాయిలందర్నీ పిలిచి లంచ్ యిద్దాం. దానికో వెయ్యి అదనంగా కట్టాలి. బాబాయిలందరూ ఒకేసారి గుమిగూడతారు కాబట్టి అప్పుడే ఫలితాలు తెలిసిపోతాయి.’’
‘‘మాయాబజారులో చెప్పినట్టు ఎటుచూచినా బాబోయనిపించే బాబాయిలన్నమాట.. బాగానే వుంది. కానీ బాబాయిల బరువు ఎలా తెలుస్తుంది? వెయింగ్ మిషన్ ఓ పక్కన పెట్టి ‘బాబాయ్, యిలా వస్తావా, కాస్త తూస్తాను’ అంటే ‘బరువు సంగతి సరే, ముందు నీ సంగతి చూస్తాను, మీ నాన్నతో చెప్పి పాకెట్ మనీ కట్ చేయిస్తాను’ అంటాడు…’’
అశ్వత్థామ కూడా అది సమస్యే అన్నాడు. క్లబ్బు సభ్యుల్లో ఐదారుగురికి చెప్తే అందరూ ఉత్సాహం చూపించారు కానీ యీ సమస్యకు ఎవరూ పరిష్కారం కనుక్కోలేకపోయారు. వేరే స్కీమేదైనా ఆలోచించాలనుకుంటూండగానే క్లబ్బు వాళ్లు చేసిన ఫంక్షన్‍లో తుల్జానంద్ అనే అతని పోగ్రాం జరిగింది. అతను ఏ లెక్క అడిగినా క్షణాల్లో సమాధానం చెప్పడమే కాదు, కంటితో చూసిన ప్రతీ వస్తువు బరువు చెప్పేయగలుగుతున్నాడు. క్యారమ్ బిళ్ల దగ్గర్నుంచి క్లబ్బు కార్యదర్శి దాకా అందరి బరువూ చెప్పాడు. తూచి చూస్తే సరిగ్గా సరిపోయింది. ఉగాదినాడు అతన్ని ‘మానవ తక్కెడ’గా వుపయోగించడానికి పోతుటీగలందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఉన్న ఏకైక అవరోధం తొలగిపోవడంతో మర్నాడే పందానికి అంతా సిద్ధమయ్యారు.
సభ్యుల పేర్లు వరుసగా రాశారు, తర్వాత వాళ్లిచ్చిన బాబాయిల పేర్లు చీటీలమీద రాసి ఓ డబ్బాలో పడేశారు. లాటరీ పద్ధతిలో తీసిన చీటీలో వున్న పేర్లు సభ్యుల పేర్లు ఎదురుగా రాశారు. తన కృష్ణుడు బాబాయి పేరు తనకే రావాలని అశ్వత్థామ దేవుణ్ని ప్రార్థించినా అది నాగేంద్రకు వెళ్లిపోయింది. నాగేంద్ర బాబాయి రమణారెడ్డి పేరు యితనికి వచ్చింది. దేవుడి లీలలు యిలాగే వుంటాయి. పుష్కలంగా డబ్బుండి తన పన్నాగాలతో దాన్ని మరిన్ని రెట్లు చేసుకునే తెలివితేటలుండి, డబ్బులక్కరలేని నాగేంద్రకు, అశ్వత్థామ బాబాయి కృష్ణుడు పేరు వచ్చింది. డబ్బుకోసమే తన బుర్ర ఖర్చు పెట్టి ప్లాన్లు వేసిన అశ్వత్థామకి, ఎలా వుంటాడో తెలియని నాగేంద్ర బాబాయి రమణారెడ్డి పేరు వచ్చింది.
అశ్వత్థామ వెంటనే నాగేంద్ర దగ్గరకి వెళ్లి ‘‘గురూ, నీకో బాబాయి వున్నాడని ఎప్పుడూ చెప్పనేలేదు. ఎలా వుంటాడేమిటి?’’ అని అడిగాడు. ‘‘నిజం చెప్పాలంటే వున్నాడని మొన్నటిదాకా నాకూ తెలియదు. మా నాన్నే అందరికంటె చిన్న. మా కజిన్ బాబాయిల్లో ఒకాయన తాగితాగి చచ్చాడు, మరో ఆయన తినితిని చచ్చాడు. వాళ్లల్లో ఎవరు బతికి వున్నా వాళ్ల పేరు రాసేవాణ్ని. నీకే ప్రైజు వచ్చి వుండేది. ఈ రమణారెడ్డి బాబాయి ఎవరో నాకూ చూసిన గుర్తు లేదు. చిన్నప్పుడే దుబాయి వెళ్లిపోయాట్ట. ఉగాది లోపునే దేశం వస్తున్నానని యి మధ్యే ఉత్తరం రాశాడు. నా అడ్రసు ఎవరిద్వారానో సంపాదించాట్ట. ఎలా వున్నావని కుశలం అడుగుతూ రాసి ‘రమణ బాబాయి’ అని సంతకం పెట్టడంతో అప్పుడు తెలిసింది – నాకూ ఓ బతికున్న బాబాయి వున్నాడని. అందుకనే ధైర్యంగా పోటీలో పాల్గొన్నాను.’’
‘‘అయితే నువ్వూ అతన్ని చూడలేదన్నమాట.. లావుగా వుంటే బాగుండును’’ ఆశగా అడిగాడు అశ్వత్థామ. ‘‘నేను చూడలేదు కానీ మరీ ఆశలు పెట్టుకోకు. దుబాయిలో వున్నవాళ్లు లావుగా ఎలా వుంటారు? ఇంట్లోంచి పారిపోయి దుబాయి వెళ్లి కూలీగా పనిచేసి వుంటాడు. ఎండకు ఎండి, తిండికి మాడి, అరబ్బు షేకుల చేతిలో నలిగి, కృంగి, కృశించి, నశించి…’’
‘‘… చాలు బాబోయ్, చాలు, పేరు బట్టే కొంత వూహించాను.’’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుని అశ్వత్థామ వెళ్లిపోయాడు.
అశ్వత్థామ వెళ్లినవైపు భారంగా చూసి, నాగేంద్ర తన చేతిలో వున్న ఉత్తరాలపై దృష్టి మరలించాడు. ఆశ్చర్యంగా అందులో ఒకటి రమణబాబాయి నుండి. ‘‘…మీ ఊరే వస్తున్నాను. రాజమహల్ అనే చోట ఓ రెండు నెలలు వుండబోతున్నాను. రాగానే నీకు తెలియబరుస్తాను. వచ్చి కలుద్దువుగాని. మనిద్దరం ఒకరి నొకరం చూసుకుని చాలా ఏళ్లయింది కాబట్టి నన్ను గుర్తు పట్టడానికి స్విమ్మింగ్ పూల్‍లో తీయించుకున్న యిటీవలి ఫోటో పంపుతున్నాను…’’ అని రాశాడు. ఆ ఫోటో చూడగానే నాగేంద్ర గుండె ఆగింది. అది ఎడారిలో కృంగిన బడుగుజీవి ఫోటో కాదు, ఇద్దరు, ముగ్గురు అరబ్ షేకులను చెరిపించి ఒక్కటిగా చేసిన దున్నపోతు ఫోటో. చెడ్డీ వేసుకున్న యి మాంసపు దుకాణం రమణారెడ్డి అని పేరు పెట్టుకోవడం లోకాన్ని మోసగించడానికే అని తోచిందతనికి.
ఈ బాబాయ్ అశ్వత్థామ సొత్తు అని స్ఫురించగానే నాగేంద్ర గుండె రగిలింది. అతను డబ్బున్నవాడు కాబట్టి డబ్బు అక్కరలేదని అన్నది నేను (అనగా రచయితని)! అతనలా అనుకోడు. ఇంకా రానీ, రానీ అనుకుంటాడు. అశ్వత్థామ గుప్పిట్లోంచి తన బాబాయిని విడిపించి, సొంతం చేసుకోవడం ఎలా అని కళ్లుమూసుకుని పన్నాగం పన్నాడు. ఇలాటి పనుల వలననే అతను పన్నాగేంద్ర అనే నిక్‍నేమ్ తెచ్చుకున్నాడు. ఆలోచన పూర్తవగానే అటు పోతున్న అశ్వత్థామని పిలిచాడు. ‘‘చూడు మిత్రమా, నేను గత పావుగంటగా కళ్లు మాసుకుని ఆలోచనామగ్నుడనై వున్న విషయం గమనించావా?’’ అని అడిగాడు.
‘‘ఆలోచనా..అదేదో అయ్యావా? నిద్రపోతున్నావనుకున్నా..’’ అన్నాడు అశ్వత్థామ అయోమయంగా.
‘‘నిద్ర కాదు, నేను యిటీవలే ఆర్ట్ ఆఫ్ గివింగ్ అనే క్లాసులకి వెళ్లానన్న విషయం నీకు తెలుసా?’’
‘‘తెలియదు. అయినా ఆ పాఠాలన్నీ యిప్పుడు చెప్పకు.. రేసులకు టైమవుతోంది..’’
‘‘ఒకే పాఠం చెప్తాను… రోజూ కనీసం ఒకరికైనా ఏదైనా యివ్వమని మాకు నేర్పారు..’’
‘‘ఇవాళ లెక్చరు యిద్దామనుకుంటున్నావా.. నావల్ల కాదు..’’
‘‘లెక్చరు కాదురా, ఉపకారం చేద్దామను కుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ బాబాయి కృష్ణుణ్ని మించిన హెవీ వెయిట్ వుండడం దాదాపు అసంభవం. ఆ చీటీ నాకే వచ్చింది కాబట్టి, నాకే ఆ లక్ష రూపాయలు రావడం ఖాయం. కానీ నీ డబ్బు అవసరం నాకు తెలుసు. అందుకని…’’
‘‘..అందుకని…?’’ ఆశగా, ఆతృతగా అడిగాడు అశ్వత్థామ. ‘‘అందుకని నా చీటీ నీకిచ్చేస్తాను. నీ దగ్గరున్న మా బాబాయ్ టిక్కెట్ నా కిచ్చేసేయ్. పోటీకై రిజిస్టర్ మేన్‍టేన్ చేస్తున్న ఆర్గనైజర్ గోపాలం దగ్గరకు వెళ్లి పేర్లు మార్పించేస్తాను.’’
అశ్వత్థామ కృతజ్ఞతాభారంతో ఒంగిపోయి, ఆనందబాష్పాలతో తడిసిపోయి, గుండె గొంతుకలోకి వచ్చి అడ్డుపడడంతో మాట్లాడలేకపోయాడు.
వారం రోజుల తర్వాత రాజమహల్‍లో బాబాయితో బాటు భోజనం చేయబోతున్న నాగేంద్రకు అనుమానం వచ్చింది – చూడబోతే ఒకటే ప్లేటు పెట్టారు, ఇంత తక్కువ తిండితో రమణారెడ్డి యింతటి శరీరాన్ని ఎలా సంపాదించాడా అని. కాస్సేపటిలోనే అనుమానం విచ్చిపోయింది. ‘‘సారీ మై బోయ్ – నీకిలాటి తిండి పెడుతున్నందుకు! లంచ్‍కు ముందు డ్రింక్ కావాలంటే వీళ్లు వేపకాయల రసం పట్టుకొస్తారు. దానితో పాటు మంచింగ్‌కి కావాలంటే ఎండబెట్టి ఒరుగులు చేసిన కాకరకాయలిస్తారు. జొన్న రొట్టె ఒకటి యిచ్చి దాన్ని కాబేజీ ఆకులతో నంచుకు తినాలంటారు..’’
‘‘..పేరు రాజమహల్ అని వుందే. ఎవరో మహారాజావారు తన భవనాన్ని హోటల్‍గా మార్చి వుంటారనుకున్నాను. తిండి చూస్తే యిలా వుందేమిటి?’’ ‘‘..మహారాజావారు హోటల్‍కి యివ్వలేదు, ఓ ప్రకృతి ఆశ్రమానికి యిచ్చారు. బరువు తగ్గాలంటే యిలాటి దానిలో చేరమన్నారు. మూడు వారాల్లో కనీసం పాతిక కిలోలు తగ్గిస్తామని వాళ్లు గ్యారంటీ యిచ్చారు..’’
నోట్లో పెట్టుకున్న కాకరకాయ వడియం మరింత చేదుగా అనిపించింది నాగేంద్రకు. ‘‘బరువు తగ్గడం దేనికి? ఇప్పుడున్నట్టు కాస్త బొద్దుగా వుంటే నష్టమేముంది?’’
రమణారెడ్డి కుర్చీ వూగిపోయేటంత ఫోర్సుగా పగలబడి నవ్వుతూ ‘‘కాస్త బొద్దుగా.. కాస్త బొద్దుగా వున్నానా!? నువ్వు వనజాక్షి కంటె ముద్దుగా మాట్లాడుతున్నావురా అబ్బాయ్! తను నన్ను మారువేషం వేసుకున్న హిప్పోపోటమస్ అంది.’’ అన్నాడు. ‘‘ఆవిడెవరు? నిన్ను అంత అన్యాయంగా మాటలంటూ వుంటే ఎలా వూరుకున్నావ్?’’ ఆవేశపడ్డాడు నాగేంద్ర. ‘‘ప్రేమలో పడ్డాక యిలాటి మాటలెన్నో పడాలి. యూరోప్‍లో ఓ క్రూజీ ట్రిప్‍లో తగిలింది. నాలో అన్ని అంశాలూ నచ్చాయి కానీ బరువు మాత్రమే నచ్చలేదంది.’’
ఈ వనజాక్షి ఓ సారి పెళ్లి చేసుకుని భర్తను పోగొట్టుకుని సంక్రమించిన ఆస్తి ఏం చేసుకోవాలో తెలియక దేశాలు పట్టుకుని తిరుగుతోందిట. రమణారెడ్డి పరిచయమయ్యాక నలభై ఐదేళ్లు వచ్చినా అతనింకా బ్రహ్మచారిగానే వున్న విషయం తెలుసుకుని పెళ్లి చేసుకుని చూడవచ్చనుకుంది. అయితే యిద్దరి మధ్యా అతని భారీకాయం అడ్డు వస్తోందని ఫిర్యాదు చేసింది. ఆమె కోసమే యితనీ బరువు తగ్గే కార్యక్రమం చేపట్టాడు.
ప్రేమకోసమై జనాలు వలలో పడడమే కాదు, వల్లమాలిన ఉపవాసాలు కూడా చేయగలరని తెలిసిన పన్నాగేంద్ర అతన్ని అశ్వత్థామకి మళ్లీ ఎలా అంటగట్టాలా అని ఆలోచించాడు. ఆ మధ్యాహ్నమే అశ్వత్థామని పిలిచాడు. ‘‘నా మొహం కేసి చూడు. పశ్చాత్తాపంతో దహించుకు పోతున్నవాడిలా కనబడుతోందా?’’ ‘‘దహించడం అయిపోయాక మాడిపోయినట్టుగా కనబడుతోంది.’’ చెప్పాడు అశ్వత్థామ. ఆ వర్ణనకి మొహం చిట్లిస్తూ ‘‘కారణం ఏమిటో తెలుసా? నీకు ద్రోహం చేశానన్న బాధే నన్ను దహించివేస్తోంది.’’ అన్నాడు నాగేంద్ర.
కాస్సేపు సస్పెన్సు మేన్‍టేన్ చేసిన తర్వాత తనకు వారం రోజుల క్రితం పోస్టులో వచ్చిన ఫోటోను బయటపెట్టాడు. ఇవాళే వచ్చిందన్నాడు. ఈ ఫోటోను చూసి వుంటే దాశరథి ‘ఏ అడవిన మేసిన ఐరావతమో, ఏ కడుపున కాసిన మహాకాయమో’ అనే పాట రాసి వుండేవాడన్నాడు. ఇంత బొండాంబాబాయ్ పేర వున్న చీటీ నీకు వస్తే అది నేను లాగేసుకుని నా పేర రాయించుకోవడం అన్యాయం అనుకున్నానన్నాడు. అశ్వత్థామ ఆ ఫోటో చూసి తన కృష్ణుడు బాబాయి ఆ సైజుకి చేరాలంటే మాణ్ణెళ్ల క్రాష్ కోర్సు తీసుకోవాల్సిందే అన్నాడు. జరిగిన పొరపాటును సరిదిద్దుకునే అవకాశం యిమ్మనమని ప్రాధేయపడి టిక్కెట్లు మార్పించుకున్నాడు నాగేంద్ర. దానికి ముందుగా కృష్ణుడికి ప్రేమలో పడే ఛాన్సులేవీ లేవని కన్‍ఫమ్ చేసుకుని చూసుకున్నాడు. నాగేంద్ర విశాలహృదయానికి జోహార్లు అర్పించడానికి అశ్వత్థామ తన జీవితం చాలదన్నాడు.
ఉగాదికి రాబోయే లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికిగాను పదిహేనురోజుల ముందుగా నాగేంద్ర బెంగుళూరు వెళ్లాడు. ఓ స్టార్ హోటల్లో డిన్నర్ చేస్తూండగా పక్క టేబుల్ వద్ద కుర్చీ ఫెళాఫెళా విరగడం, పడి లేచినాయన కుర్చీల నాజూకుతనాన్ని తిట్టడం వినబడింది. తలతిప్పిన నాగేంద్ర పొలికేక పెట్టాడు – ‘‘బాబాయ్’’ అని. రమణారెడ్డి పాతిక కిలోలు తగ్గకపోగా పెరిగినట్టున్నాడు. రాజమహల్ ఎప్పుడో వదిలిపెట్టేశాడట. ‘మరి వనజాక్షో’ అని అడిగితే అదెవరు? అన్నాడు. ‘నిన్ను నిన్నుగా ప్రేమించేవాళ్లే నిజమైన ప్రేమికుల’న్నాడు. ఈ రోజు కడుపు మాడించినవాళ్లే రేపు గుండె మండిస్తారన్నాడు. పోతుటీగల క్లబ్బు ఉగాదినాటి పార్టీకి తప్పకుండా వచ్చి తీరతానన్నాడు.
బెంగుళూరు నుండి తిరిగి వస్తూనే నాగేంద్ర అశ్వత్థామ వేటలో పడ్డాడు. అతను యిటీవల క్లబ్బుకి రావడం మానేయడానికి కారణం క్లబ్బు కుర్రాడు చెప్పాడు. ఉగాదినాటి పోటీలో ఎలాగూ లక్ష రూపాయలు వస్తున్నాయి కదాని అశ్వత్థామ ఓ బుక్కీ దగ్గర ఏభై వేలు అప్పుచేసి ఓ అశ్వంమీద పెట్టుబడి పెట్టాడట. అది అతనికి కాలిచ్చింది. అతను బుక్కీకి చెయ్యిచ్చాడు. కానీ ఆ బుక్కీ నక్షత్రకుడు మాత్రమే కాదు తన బాకీదార్ల తారాబలం కూడా చెప్పగలడు. ‘‘నేను చెప్తే నువ్వు మూఢనమ్మకం అంటూ కొట్టి పారేయవచ్చు. అదేమిటో కానీ నా దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టిన ప్రతీవాడికి వారం తిరక్కుండా యాక్సిడెంటు అవుతోంది. నీ మొహాన అదే రాసివున్నట్టు కనబడుతోంది.’’ అన్నాడా బుక్కీ అశ్వత్థామతో. మర్నాటినుండి అశ్వత్థామ అదృశ్యం అయిపోయాడు. గడ్డం తగిలించుకుని పాతబస్తీలో తిరుగుతున్నాడని క్లబ్బు కుర్రాడి భోగట్టా. అతన్ని పట్టుకుని టిక్కెట్టు మార్పించుకోకపోతే లక్ష రూపాయలకూ రెక్కలు వస్తాయన్న భయంతో నాగేంద్ర పాతబస్తీలో తిరిగితే అందరూ గడ్డం వున్నవాళ్లే కనబడ్డారు. లాగి, పీకి చూద్దామనుకుంటే భయం వేసింది.
పాండవులను సంహరించి వస్తానని చెప్పి వెళ్లిన అశ్వత్థామ కోసం దుర్యోధనుడు ఎంత ఆతృతగా ఎదురు చూశాడో యీ అశ్వత్థామ కోసం నాగేంద్ర అంతకంటె ఎక్కువ ఆదుర్దాతో ఎదురు చూశాడు. చివరకు ఉగాదినాటి ఉదయం ఆఖరి నిమిషంలో ఓ బవిరి గడ్డపు వేదాంతి ఓ టాక్సీలోనుండి దిగి బాత్‍రూమ్‍లోకి పరుగు పెట్టడంతో నాగేంద్ర అతన్ని వెంటాడాడు. అతి కష్టం మీద జిగురుగడ్డం వదుల్చుకుంటున్న (వాసి కంటె రాశికే ఎక్కువ ప్రాధాన్యం యిస్తే యిలాగే జరుగుతుంది) వేదాంతే అశ్వత్థామ అని తేలగానే నాగేంద్ర పలికినమొదటి మాట – ‘‘అమ్మయ్య, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నాకు అవకాశం దొరికింది’’ అని.
గడ్డం పీకడం సగంలో ఆపి, తెల్లబోయిన అశ్వత్థామకు వివరించాడు, ‘‘మా రమణబాబాయి రాజమహల్లో వున్నాడని చెప్పాను కదా! అదేదో స్టార్ హోటల్ అనుకున్నా, కాదుట. ప్రకృతి వైద్యశాలట. అర్జంటుగా పాతిక కిలోలు తగ్గించే కార్యక్రమంలో పడ్డాడు. ఇది వినగానే నిన్ను మోసగించిన గిల్టీ ఫీలింగు నాలో మెదిలింది. మళ్లీ పేర్లు మార్పిద్దామంటే నువ్వు కనబడలేదు. పోటీకి టైమవుతోంది ఎలాగా అని మథన పడుతూంటే ఆఖరి నిమిషంలో కలిశావు. పద, టిక్కెట్లు మార్చేసుకుందాం..’’
కానీ అశ్వత్థామ కదలలేదు. ‘‘వద్దు బ్రదర్, అలాగే వదిలేద్దాం. మా కాలజ్ఞాని బుక్కీ చెప్పాడు – నాకు త్వరలోనే యాక్సిడెంటు అవుతుందని. నువ్వు నాకు మేలు చేయబోయినా, అది నాకు కీడుగా మారవచ్చు. అలాగే వుంచేద్దాం. మీ మావయ్య పాతిక కిలోలు తగ్గినా, మా మావయ్య కంటె భారీగానే వుండవచ్చేమో. ఏదో ఒకటి చేసి, రిస్కు తీసుకునే పరిస్థితిలో లేను. నా రోజులు అస్సలు బాగా లేవు. ఆ బుక్కీగాడికి యాభైవేలు బాకీ పడి వున్నాను.’’
పన్నాగేంద్ర వెంటనే ఆఫర్ యిచ్చాడు, ‘‘నా మనస్సాక్షి నన్ను వూరికే వుండనివ్వటం లేదు. ఆ యాభైవేలూ యివిగో. వెంఠనే టాక్సీలో వెళ్లి బుక్కీగాడి అప్పు తీర్చేయి. మా బక్క మావయ్యతో పడాల్సిన అవస్థలేవో నేనే పడతాను. పద పేర్లు మార్చేసుకుందాం.’’
ఏభై వేలు అందుకోవడానికి అశ్వత్థామ సందేహించాడు – ‘‘ఎందుకింత త్యాగం? దీనిలో నీకు కలిసి వచ్చేదేముంది?’’ అని. ‘‘నీ కళ్లల్లో ఆనందం చూడడానికే, అశ్వత్థామ బావా..’’ సగం వూడిన గడ్డంలోంచి ఎంతమొహం కనబడితే అంత మొహమూ వెలుగులు చిమ్మింది. కళ్లల్లో ఆనందం నాగేంద్ర ఆశించిన దాని కంటె కూడా పొంగి పొర్లింది. విసుక్కుంటున్న గోపాలాన్ని బతిమాలి పేర్లు మార్పించి, అశ్వత్థామను తరిమేసిన పావుగంటకు వచ్చిన రమణారెడ్డిని నాగేంద్ర ఒళ్లంతా కళ్లు చేసుకుని ఆహ్వానించాడు. అతన్ని చూడగానే సభ్యులందరూ వచ్చి ‘‘మనకింక మానవ తక్కెడతో పని లేదు. చూడగానే చెప్పవచ్చు, మీ బాబాయిని దాటగలిగేవాడు యిప్పట్లో తయారవ్వడు’’ అన్నారు. కానీ ఆర్గనైజర్ గోపాలం చాదస్తం గోపాలానిదే. భోజనాలు అవుతూండగానే వెళ్లి అందరి పేర్లూ రాసుకుని వచ్చాడు.
అక్కడ ఏం జరిగిందో ఏమో ఆందోళనగా నాగేంద్రను పక్కకు పిలిచి ‘‘నువ్వింత మోసం చేస్తావనుకోలేదు. బాబాయంటే బాబాయిలనే పిలవాలి తప్ప లావుగా వున్నాడు కదాని కజిన్ బ్రదర్‍ను పిలవడం చీటింగ్!’’ అన్నాడు ఆవేశంగా. పక్కనున్న యిద్దరు ముగ్గురు వెంటనే ‘‘ఏం జరిగింది?’’ అన్నారు. గోపాలం చెప్పాడు – ‘‘రమణారెడ్డి గారి యింటిపేరు వేరేలా వుండడంతో ఏమండీ మా నాగేంద్రరెడ్డి మీకేమవుతాడండీ అని అడిగితే ‘మా పిన్ని గారబ్బాయి’ అన్నాడాయన. ‘మరి బాబాయి అని చెప్పాడే’ అంటే ఫక్కున నవ్వి ‘చిన్నప్పుడు నన్ను బాబాయి బాబాయి అని పిలిచేవాడు. నేను చాలాకాలంగా దుబాయిలో వుండి రాకపోకలు లేకపోవడంతో చిన్నప్పటినుండీ పిలిచిన పిలుపు ప్రకారం బాబాయి అని చెప్పి వుంటాడు’ అన్నాడు.’’
నాగేంద్ర మొహం పాలిపోయి, ‘‘నిన్ను పోటీలోంచి తప్పించేశాం.’’ అని గోపాలం అనడంతో మాడిపోయింది కూడా. ఆ మాడుమొహంతోనే రమణారెడ్డి దగ్గరకు వెళ్లి ‘‘ఏమిటి బాబాయ్, నువ్వు బాబాయివి కావా?’’ అని ఛడామడా అడిగేశాడు.
ఆయన నాగేంద్ర భుజం తట్టి ‘‘నీకూ నాకూ యిరవై ఏళ్లు తేడా కదూ, మర్చిపోయి వుంటావు. మీరూ, మేమూ పక్క పక్క యిళ్లల్లో వుండేవాళ్లం. అప్పుడు నీకు ఐదేళ్లుంటాయి. బుడుగు పుస్తకం చూసి నేనే బుడుగు అంటూ తిరిగేవాడివి. బుడుగుకి బాబాయి వున్నాడు, నాకు లేడు అని ఏడిస్తే ‘నువ్వు అబ్బాయ్ – నేనే నీ బాబాయ్’ అని చెప్పి వూరుకోబెట్టేవాణ్ని. ఎందుకంటే నీ అసలు బాబాయిలు వేరే వూళ్లో వుండేవారు. మా అమ్మని ‘పెద్దమ్మా’ అని పిలిచినా, నన్ను రమణ బాబాయి అనే అనేవాడివి. అలా అంటేనే గుర్తుకు వస్తాను కదాని, మొన్న వుత్తరంలో అలాగే సంతకం పెట్టా..’’ అన్నాడు.
ఆయన ‘గాత్రం’ ఎంత పెద్దదంటే క్లబ్బు సభ్యులంతా విన్నారు. పక్కకు వచ్చి ‘‘నాగేంద్ర బోగస్ బాబాయిని పోటీనుండి తొలగించాం కాబట్టి నెక్స్‌ట్ హెవీవెయిట్ బాబాయి కృష్ణుడే అని చూడగానే తెలుస్తోంది. అందువలన ఆ టిక్కెట్టు వున్న అశ్వత్థామకే లక్ష రూపాయలూ యివ్వాలి’’ అనేశారు.
నాగేంద్రకు కన్నీళ్లు ఉబికి వుబికి రాసాగాయి. లక్ష లాభం వస్తుందనుకుంటే ఏభై ఆరువేలు వేలు నష్టం వచ్చింది. 50 వేలు అశ్వత్థామకు, 5 వేలు పోటీలో టిక్కెట్టు కొనడానికి, ఆ పై వెయ్యి రమణారెడ్డి ఉగాది విందుకి ! (పి జి ఉడ్‍హౌస్ రాసిన ‘ది ఫ్యాట్ ఆఫ్ ద ల్యాండ్’ కథ ఆధారంగా)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)