ఏపీలో పాలాభిషేకాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. గతంలో ఈ వింత ఉన్నా ఇటీవల కాలంలో మరీ ఎక్కువ అయింది. ఏ చిన్న ఆనందం తమకు సీఎం కలిగించినా జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం ఆనవాయితీగా మారిపోయింది.
అలా జగన్ కి పాలాభిషేకాలు అన్నది ఒక అలవాటుగా మారిపోయింది. సరిగ్గా ఈ టైమ్ లో జగన్ కి పోటీగా మరో నేతకు పాలాభిషేకాలు జరుగుతున్నాయంటే అది విడ్డూరం కంటే ఇంకా ఎక్కువే. ఆయన ఎవరో కాదు, పొరుగు రాష్ట్రం సీఎం కేసీయార్.
ఆయన ఈ రోజు ఉదయం అసెంబ్లీ వేదికగా దాదాపుగా తొంబై వేల ఖాళీలను ఒకే దెబ్బకు భర్తీ చేయాలని నిర్ణయించారు. అంతే ఏపీలోని నిరుద్యోగులు సైతం కేసీయార్ జై అన్న నినాదం అందుకున్నారు. విశాఖలో ఆయన చిత్రపటానికి ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆద్వర్యంలో పాలాభిషేకం చేశారు. నిరుద్యోగుల పాలిట కేసీయార్ దేవుడు అని కూడా కీర్తించారు.
అంతటితో ఆగకుండా ఏపీలో జగన్ సైతం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఖాళీగా ఉన్న 2,32,000 ఉద్యోగాలను తక్షణం భర్తీ చేయడానికి జగన్ నిర్ణయం తీసుకోవాలని కూడా కోరారు.
ఇక ఏపీలో ఉద్యోగాల కోసం అర్హతగా వయో పరిమితిని 47 ఏళ్ళకు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి విశాఖలో కేసీయార్ కి పాలాభిషేకం జరగడం వైరల్ అవుతోంది.