ముఖ్యమంత్రి పీఠంపై వైఎస్ జగన్‌ను టీడీపీ చూడలేకపోతోంది. ఓర్వలేకపోతోంది. ఇకపై అధికారం లేకుండా టీడీపీ నేతలు ఉండలేరేమో అన్నంత అసహనం వారిలో కనిపిస్తోంది. వైఎస్ జగన్ పాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓ చార్జిషీట్ వేసింది. ఆ చార్జిషీట్‌కు ‘జగన్‌రెడ్డి 1000 రోజుల విధ్వంస పాలనలో వెయ్యి నేరాలు-ఘోరాలు-లూటీలు- అసత్యాలు’ అని పేరు పెట్టారు.
ఈ చార్జీషీట్లో జగన్ అధికారంలోకి వచ్చిన మొదలు రాజధాని అమరావతి విధ్వంసం, ఆలయాలపై , టీడీపీ కార్యాలయాలపై, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై, ఇలా అనేక సంస్థలు, వ్యక్తులపై దాడులకు తెగబడిందని ప్రస్తావించారు. ఈ చార్జిషీట్లో ప్రధానమైన అంశానికి చోటు దక్కలేదు. వైఎస్ జగన్ అధికారం తమ పార్టీ విధ్వంస పునాదులపై నిర్మితమైందని ఆ పార్టీ గుర్తించకపోవడం గమనార్హం.
కేవలం 23 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లకు మాత్రమే టీడీపీని కట్టడి చేశారంటే, జగన్ విధ్వంసం ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఆ విధ్వంసం కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పోటీకి నిలబడాలన్నా టీడీపీ భయపడాల్సిన పరిస్థితి.
చివరికి టీడీపీ కంచుకోట, చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ విధ్వంసానికి టీడీపీ కకావికలమైందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
ఏనాడూ తన నియోజక వర్గం వైపు కన్నెత్తి చూడని చంద్రబాబు… జగన్ విధ్వంసం పుణ్యాన నెలకో, రెండునెలలో కుప్పంలో పర్యటించాల్సి వస్తోంది. నారా లోకేశ్‌ను మంగళగిరిలో మట్టి కరిపించడం జగన్ విధ్వంసంలో భాగమే. ఇప్పటికీ నారా లోకేశ్‌కు సురక్షితమైన నియోజకవర్గమంటూ లేకపోవడం జగన్ విధ్వంసానికి సంకేతం.
టీడీపీ ఆరోపిస్తున్నట్టు ఇవాళ ఏపీలో విధ్వంసానికి ప్రధాన కారణం ప్రధాన ప్రతిపక్షం కోలుకోలేనంతగా బలహీనపడడమే. జగన్ విధ్వంసానికి తునాతునకలైన సైకిల్‌కు ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇప్పటికైనా చార్జిషీట్లు, జూమ్ మీటింగ్‌లు, ట్వీట్లు, ఎల్లో మీడియా కథనాలతో సంతృప్తి చెందకుండా, అత్యంత శక్తిమంతుడైన జగన్‌ను ఎదుర్కొనేందుకు వ్యూహ రచన చేస్తే మంచిది. ఎందుకంటే జగన్ విధ్వంసం చేసింది టీడీపీని కాబట్టి. అది గుర్తించి, సరిదిద్దుకోవాల్సింది టీడీపీనే.