ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా.. తేలేది ఈరోజే!

గతంలో ఎగ్జిట్ పోల్స్ అంటే దాదాపుగా 90శాతం ఫలితాలను ప్రతిబింబించేవి. కానీ ఇప్పుడు ఎవరి డప్పు వారు కొట్టుకుంటున్నట్టు, ఎవరి ఛానెల్ వారికి ఉన్నట్టు.. ఎగ్జిట్ పోల్స్ పై కూడా పార్టీల రంగులు పడుతున్నాయి.…

గతంలో ఎగ్జిట్ పోల్స్ అంటే దాదాపుగా 90శాతం ఫలితాలను ప్రతిబింబించేవి. కానీ ఇప్పుడు ఎవరి డప్పు వారు కొట్టుకుంటున్నట్టు, ఎవరి ఛానెల్ వారికి ఉన్నట్టు.. ఎగ్జిట్ పోల్స్ పై కూడా పార్టీల రంగులు పడుతున్నాయి. ఆమధ్య పశ్చిమబెంగాల్ విషయంలో మమతా బెనర్జీకి అధికారం దక్కదని, దక్కినా పెద్దగా మెజార్టీ ఉండదని ఎగ్జిట్ పోల్స్ చెప్పగా.. అంచనాలకు భిన్నంగా ఫలితాలొచ్చాయి. 

అంతెందుకు.. ఏపీ ఎన్నికల టైమ్ లో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. జగన్ కు రికార్డ్ స్థాయి మెజారిటీ వచ్చింది. చారిత్రక విజయం దక్కింది. ఈరోజు ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. ఏ పార్టీ గెలుస్తుందనే టాపిక్ కంటే.. ఏ ఎగ్టిట్ పోల్ నిజమవుతుందనే విషయంపైనే ఎక్కువ చర్చ నడుస్తోంది.

యూపీలో అందరూ బీజేపీకే..

ఉత్తర ప్రదేశ్ కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కడుతున్నాయి. ఇండియా టుడే-యాక్సిస్, ఏబీపీ సీ ఓటర్, న్యూస్18-మ్యాట్రిక్స్, టైమ్సమ నౌ-వీటో, టుడేస్ చాణక్య.. ఇలా అన్ని సర్వేలు బీజేపీ స్కోరు 225 నుంచి 300కి దాటిపోతుందని చెబుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ కూడా ముందుగానే ఓటమిని ఒప్పుకున్నట్టు.. పరోక్షంగా ఈవీఎంలపై ఫిర్యాదు చేయడం విశేషం.

ఇక కాంగ్రెస్ విషయంలో అందరూ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. అక్కడ చూస్తే ప్రియాంక గాంధీ అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ప్రచారంలో హోరెత్తించారు. బీజేపీ అధికారం నిలబెట్టుకున్నా.. మిగతా పార్టీల ఓట్లు, సీట్ల విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.

పంజాబ్ ఆప్ కే..

పంజాబ్ లో కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆమ్ ఆద్మీకే పట్టం కట్టాయి. ఇండియా న్యూస్ సర్వే ఒక్కటే.. కాంగ్రెస్, అకాళీదళ్ కూడా గట్టిపోటీ ఇవ్వొచ్చని చెప్పింది. మరి ఇక్కడ ఆప్ గెలిచినా సీట్ల లెక్కల్లో ఏ సర్వే అంచనా కరెక్ట్ అవుతుందో చూడాలి.

ఉత్తరాఖండ్ లో ఇండియా టుడే సర్వే బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని జోస్యం చెబితే, ఏబీపీ-సీఓటర్ సంస్థ కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని చెబుతోంది. ఇక్కడ హంగ్ తప్పదనే మిగతా సంస్థలు లెక్క తేల్చాయి. మరి అసలు ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

మణిపూర్ లో బీజేపీదే అధికారం అంటూ అన్ని సంస్థలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. గోవాలో హంగ్ కే అవకాశాలున్నాయని తేలుతోంది. మొత్తమ్మీద ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉంటాయో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.