సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాకపోయి వుంటే ఆరోగ్యకరమైన కామెడీని మిస్ అయ్యేవాళ్లం. ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కావడం వల్లే పార్టీ విధివిధానాలపై సోము వీర్రాజు మాట్లాడాల్సి వస్తోంది. ఈ సందర్భంగా తనలో నిద్రాణమై ఉన్న కమెడియన్ మేల్కొంటున్నాడు. చాలా కాలంగా ఆయన రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ, సోము వీర్రాజులో కమెడియన్ ఉన్నారనే విషయం మాత్రం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.
వైసీపీ సీనియర్ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారంపై సోము వీర్రాజు తన మార్క్ స్పందన తెలియజేశారు. తన తండ్రి హత్య కేసులో విచారణ చేపట్టిన సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా ‘సీబీఐకి ఇస్తే ఏమవుతుంది? అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరతాడు. అతడికేమీ కాదు.. 11 కేసులకు మరొకటి తోడై12 కేసులు అవుతాయ్’ అని సోదరుడైన సీఎం జగన్ తనతో అన్నట్టు సునీత పేర్కొన్న సంగతి తెలిసిందే.
బీజేపీలో అవినాశ్‌రెడ్డి చేరుతారనే ప్రచారంపై సోము వీర్రాజు స్పందించారు. గనులు అమ్మేవారితో బీజేపీకి పనిలేదని, అవినాశ్‌రెడ్డి తమ పార్టీకి అక్కర్లేదని స్పష్టం చేశారు. అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరతానని ఎవరితో అన్నారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
అవినాశ్‌రెడ్డి లాంటి వాళ్లని బీజేపీలోకి ఆహ్వానించాల్సిన అవసరంరాదని సోమువీర్రాజు పేర్కొన్నారు. బీజేపీలో ఉన్నవాళ్లంతా పరిశుద్ధ నాయకులన్నట్టు సోము వీర్రాజు మాటలున్నాయి.
గుజరాత్ మారణహోమంలో మోదీ, అమిత్‌షాలపై సీబీఐ కేసులు, అలాగే ఎవరెవరిపై రాష్ట్ర బహిష్కరణ వేటు వేశారో వీర్రాజుకు తెలియదని అనుకోవాలా? అంతెందుకు , టీడీపీ రాజ్యసభ సభ్యులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్ తదితరులు బీజేపీలో చేరడానికి వారి ఆర్థిక నేరాలే కారణమనే విమర్శలపై వీర్రాజు ఏం చెబుతారు?
పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడలేదనుకున్న చందంగా బీజేపీ నేతల ప్రగల్భాలు ఉన్నాయి. హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న అవినాశ్‌రెడ్డి లాంటి వాళ్లు తమకు అవసరం లేదని సోము వీర్రాజు అంటే ఎవరైనా పడి పడి నవ్వుకోక ఏం చేస్తారు? సోము వీర్రాజు గారు మీరు కేఏ పాల్, బండ్ల గణేశ్, నటుడు గరుడ పురాణం శివాజీ కంటే తోపు భయ్యా అని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.