ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడవుతున్నాయి. ఆల్రెడీ కౌంటింగ్ మొదలైంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీదే అధికారం.. మరోసారి ఆ నాలుగు రాష్ట్రాలూ బీజేపీకే దక్కుతాయనే అంచనాలున్నాయి.
రాగా పోగా కాంగ్రెస్ చేతిలోని పంజాబ్.. ఆమ్ ఆద్మీ చేతుల్లోకి వెళ్లబోవడం ఒక్కటే కాస్త సంచలనమైన అంశంగా మారుతుంది. అయితే 4 రాష్ట్రాల్లో బీజేపీ నుంచి బీజేపీకే అధికారం వెళ్లడం పెద్ద విశేషమేమీ కాకపోయినా.. అన్ని పార్టీలు ఎన్నికల ఫలితాల కోసం మాత్రం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఎంట్రన్స్ టెస్ట్ గా నిలిచిన వేళ.. అందరి చూపు బీజేపీపై పడింది. అత్యథిక లోక్ సభ సీట్లున్న రాష్ట్రం యూపీలో బీజేపీ మళ్లీ పట్టు నిలుపుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ (ఎంపీల విషయంలో) అక్కడ ఆ పార్టీ హవా చూపిస్తుంది.
మిగతా రాష్ట్రాలపై కూడా దాని ప్రభావం గట్టిగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. బీజేపీతో టీడీపీ, వైసీపీ రణమా.. శరణమా తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
టీడీపీ కిం కర్తవ్యం..
ఇప్పటికే బీజేపీతో దోస్తీకి సిద్ధంగా ఉన్న చంద్రబాబు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేక ఫలితాలొస్తే ప్లేటు ఫిరాయించేవారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం చంద్రబాబు బీజేపీకి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తారు.
ఎలాగైనా 2024లో ఏపీలో బీజేపీ, జనసేనతో జట్టు కట్టి పోటీ చేయాలనేది బాబు ఆలోచన. దానికి తగ్గట్టు ఇప్పటినుంచే తన పథకం అమలు చేస్తారు. ఎన్నికల ఫలితాలపై కచ్చితంగా బాబు స్పందిస్తారు. బీజేపీని పొగిడేసి, మోదీకి జై అంటారనేది దాదాపు ఖాయం.
మరి జగన్ సంగతేంటి..?
జగన్ బీజేపీకి దగ్గర కాదు, అలాగని దూరం కాదు. పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ బీజేపీపై విరుచుకుపడుతున్న సందర్భంలోనూ జగన్ న్యూట్రల్ గానే ఉన్నారు. కేసీఆర్ అన్ని రాష్ట్రాలు తిరిగొచ్చారు కానీ మోదీకి వ్యతిరేక జట్టు కోసం జగన్ ని మాత్రం కలవలేదు, ఏపీకి రాలేదు. అంటే అలాంటి మీటింగ్ లను కూడా జగన్ ఎంకరేజ్ చేయలేదనే విషయం స్పష్టమవుతోంది. జగన్ వెళ్తున్న దారి రహదారి.
సో.. బీజేపీ గెలిచినా, ఓడినా జగన్ పెద్దగా ప్రభావితం అయ్యే అవకాశం లేదు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా, ఏపీకి నిధుల విడుదల విషయంలో జగన్ స్ట్రాటజీ మార్చాల్సి ఉంటుంది. కేంద్రంలో బీజేపీ బలం పెరిగితే సానుకూల ధోరణితో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తే మాత్రం జగన్ కచ్చితంగా ఆ పార్టీని ధిక్కరించే అవకాశం వచ్చి ఉండేది. కానీ అది సాధ్యమయ్యేలా లేదు, అంటే ఏపీకి ప్రత్యేక హోదాని డిమాండ్ చేసి సాధించుకునే అవకాశం లేదు.
సో.. జగన్ బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తే కేంద్రంలో ఏ పనీ కాదని అర్థమవుతోంది. బీజేపీ బలం పెరిగితే.. జగన్ కూడా వీలైనంత వరకు ఆ పార్టీతో స్నేహంగా ఉండాల్సి రావొచ్చు. కాకపోతే ఇప్పుడున్నట్టుగానే అంటీముట్టనట్టు వ్యవహరిస్తారా లేక మోదీ ప్రభుత్వానికి మరింత దగ్గరవుతారా అనేది మాత్రం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తేలే అవకాశం ఉంది.