గంటలు గడుస్తున్నాయి. ఆశలు ఆవిరవుతున్నాయి. కనీసం మృతదేహాలు కూడా దొరకని దయనీయ పరిస్థితి. గోదారిలో మునిగిన లాంచీ జాడ ఇంకా దొరకలేదు. వివిధ బృందాలుగా ఏర్పడిన వందల మంది సిబ్బంది అత్యాధునిక టెక్నాలజీతో గోదారిని జల్లెడ పడుతున్నప్పటికీ లాంచీ ఆచూకి లభ్యంకాలేదు. గోదావరి నదిలో వంద అడుగుల లోతుకు లాంఛీ జారిపోయి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతుంటే.. వరద ఉధృతికి మరోచోటుకు కొట్టుకొని పోయి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు.
బోటులో 73 మంది ప్రయాణిస్తుండగా, వాళ్లలో 38 మంది ఆచూకి లభ్యంకాలేదు. వీళ్లంతా లాంఛీ అడుగున చిక్కుకొని ఉంటారని, మరికొందరు లాంచీలోని ఏసీ డెక్ లో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. నిన్నంతా ఎంత వెదికినా బోటు ఆచూకి దొరకలేదు. కనీసం ఒక్క మృతదేహం కూడా లభ్యంకాలేదు. వందల మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఓఎన్జీసీ హెలికాప్టర్లు, ఉత్తరాంఖండ్ బృందాలు విడివిడిగా వెదికినప్పటికీ ఫలితం దక్కలేదు.
మరోవైపు ఎందుకైనా మంచిదని ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు మూసేశారు. అక్కడ బలమైన వలలు ఏర్పాటుచేశారు. మృతదేహాలు కొట్టుకొచ్చే అవకాశం ఉండడంతో ఈ పనిచేశారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. మరోవైపు నేవీకి చెందిన అత్యాధునిక స్కానర్లను ఉపయోగిస్తున్నప్పటికీ లాంచీ ఆచూకీ లభ్యంకాలేదు. నేవీకి చెందిన గజఈతగాళ్లు 60 అడుగుల కిందకు మాత్రమే వెళ్లగలరు. లాంచీ మాత్రం 300 అడుగుల లోతుకు చేరుకొని ఉంటుందని భావిస్తున్నారు.
ఈరోజు ఎన్డీఆర్ఎప్, నేవీ, ఓఎన్జీసీకి చెందిన మరింత మంది సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. ముంబయి నుంచి అత్యాధునిక పరికరాల్ని కూడా తెప్పిస్తున్నారు. అయితే ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టకపోవడం, ఈరోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయనే సంకేతాలు రావడంతో సహాయక చర్యలు ప్రశ్నార్థకంగా మారాయి.