ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉన్న మహేశ్వర్ రెడ్డి సస్పెన్షన్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆయన తనను గతంలో పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు సంబంధం లేదని అంటున్నాడని అంటూ భావన అనే ఒక యువతి ఆరోపించింది. ఆయనపై పోలీసు కేసు కూడా పెట్టింది. దీంతో మహేశ్వర్ రెడ్డిని ట్రైనింగ్ క్యాంప్ నుంచి సస్పెండ్ చేసినట్టుగా ప్రకటన వచ్చింది.
ఉద్యోగం వచ్చాకా మహేశ్వర్ రెడ్డి తనను వదిలించుకోవాలని చూస్తున్నాడు అని భావన ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆయనపై ఆ చర్యలు తీసుకున్నారు. అయితే తన సస్పెన్షన్ పై క్యాట్ ను ఆశ్రయించాడు మహేశ్వర్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన సస్పెన్షన్ ను క్యాట్ రద్దు చేసింది.
ఈ సందర్భంగా క్యాట్ కొన్ని ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేసింది. 'భార్యాభర్తల మధ్యన మనస్ఫర్థలు అనేవి మామూలే.. అవి ఏ ఇంట్లో అయినా ఉంటాయి. తన అఫిడవిట్ లో భావనను తన భార్యగానే పేర్కొన్నాడు మహేశ్వర్ రెడ్డి. అలాంటప్పుడు వివాదాన్ని చిన్నదిగానే చూడాలి. అలాంటి కారణానికి సస్పెండ్ చేస్తూ పోతే.. చాలా మంది అధికారులు విధుల్లో ఉండరు. ఫ్యామిలీ కోర్టుల్లో బోలెడన్ని వివాదాలు పెండింగ్ లో ఉన్నాయి..' అంటూ క్యాట్ వ్యాఖ్యానించింది.
మహేశ్వర్ రెడ్డి మీద సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ క్యాట్ నిర్ణయం తీసుకుంది. దాన్నొక కుటుంబ వివాదంగానే చూడాలని పేర్కొంది. దీంతో ఆ ట్రైనీ ఐపీఎస్ కు ఊరట లభించింది.