అధికార వికేంద్రీకరణ జరగాలంటూ ప్రకటించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అదే సమయంలో స్వర్ణభారత్ ట్రస్ట్ లో రైతులు తమ గోడు చెప్పుకోడానికి వెళ్తే మాత్రం వారికి భరోసా ఇచ్చి పంపించేశారు. రైతుల త్యాగం తనకు తెలుసని, తాను ఎవరికి చెప్పాలో వారికే చెబుతానని అన్నారు. పరోక్షంగా జగన్ పై ప్రధానికి ఫిర్యాదు చేసేలా మాట్లాడారు. ఒకేరోజు ఒకే సమస్య గురించి ఇలా రెండురకాలుగా స్పందించిన వెంకయ్య నాయుడు మీడియాకి మంచి మసాలా విందు పెట్టారు.
ఆయన వ్యాఖ్యల్ని జగన్ కి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు వండి వడ్డిస్తున్నారు. రాగా పోగా తేలింది ఏందంటే.. వెంకయ్య నాయుడికి తెలుగు మీడియం దెబ్బ బాగా తగిలినట్టుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లిష్ మీడియం విధానాన్ని ఏకపక్షంగా వ్యతిరేకించిన వాళ్లలో ఆయన కూడా ఒకరు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్ లో ఇంగ్లిష్ మీడియం, ఆయన పిల్లలంతా ఇంగ్లిష్ మీడియం.. చివరకు ఆయన మాత్రం తెలుగు అభిమాని, ఇదెక్కడి చోద్యం అంటూ ఏకంగా ముఖ్యమంత్రే తీవ్ర వ్యాఖ్యలు చేసిన వేళ.. వెంకయ్య నాయుడు బాగా ఇబ్బంది పడ్డారు.
రాజకీయాల్లో లేకపోయినా ఇలా విమర్శలు ఎదుర్కోవాలసి వస్తుందని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఇకపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తున్నట్టుగా కానీ, వ్యతిరేకిస్తున్నట్టుగా కానీ మాట్లాడి తన పదవికి ఉన్న హుందా తనాన్ని తగ్గించుకోదలచుకోలేదు వెంకయ్య.
అందుకే రాజధాని విషయంలో మధ్యే మార్గాన్ని ఎంచుకున్నారు. ఓవైపు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూనే, మరోవైపు అమరావతి రైతులపై సానుకూలంగా స్పందించారు. మొత్తమ్మీద తెలుగు మీడియం గురించి మాట్లాడి తిన్న చీవాట్లు పెద్దాయనలో మంచి మార్పే తీసుకొచ్చాయి. పాము చావకుండా, కర్ర విరగకుండా తనదైన స్టైల్ లో మాట్లాడి సరిపెట్టారు వెంకయ్య నాయుడు.