ఒకవైపు తను చెప్పందే ఏపీ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకోదు అనే రేంజ్ లో బిల్డప్ ఇస్తూ ఉంటారు సుజనా చౌదరి. మోడీ, అమిత్ షాలకు తను ఎంత చెబితే అంత.. అన్నట్టుగా ఉంటాయి ఆయన మాటలు. రాజధాని అమరావతి విషయంలో కూడా మొదట్లో ఈ చౌదరి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తనకు అమరావతిలో సెంటు భూమి ఉందని నిరూపించాలని సవాల్ విసిరారు. ఆ మరుసటి రోజే వైసీపీ వాళ్లు పెద్ద జాబితాను విడుదల చేశారు. దానిపై సుజనా చౌదరి ఇప్పటి వరకూ స్పందించలేదు!
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఆ తర్వాత అమరావతి గురించి కూడా సుజనా చౌదరి గట్టిగా మాట్లాడటం లేదు! ఆ సంగతలా ఉంటే.. సుజనా చౌదరి పలు అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై విచారణకు ఆదేశించాలంటూ రాష్ట్రపతి కి వైఎస్ఆర్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి రాసిన లేఖపై స్పందన ఆసక్తిదాయకంగా మారింది. సుజనా చౌదరి వచ్చిన ఫిర్యాదుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం ఆయా శాఖలకు సమాచారం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. తను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్టుగా ప్రకటించారు. సుజనా చౌదరి అనేక అక్రమాలకు పాల్పడినట్టుగా ఆయన పేర్కొన్నారు. వాటిపై విచారణ చేపట్టాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు.
ఇక ఈ అంశంపై సుజనా చౌదరి స్పందిస్తూ.. అవన్నీ చాలా చిన్న విషయాలు అంటున్నారు. రాష్ట్రపతి ఆఫీసు నుంచి అలాంటి లేఖలు వెళ్లడం పెద్ద విషయం ఏమీ కాదని ఆయన అంటున్నారు. మొత్తానికి రాష్ట్రపతి కార్యాలయం డమ్మీ అన్నట్టుగా సుజనా చౌదరి గమనించడం గమనార్హం. తన మీద చర్యలు ఉండవన్నట్టుగా ఆయన స్పందించారు. రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు పెద్దవేవీ కావని ఈ ఎంపీగారు ప్రకటించుకున్నట్టున్నారు!