సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీర్పులు, వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పడం ఎల్లో మీడియాకు అలవాటుగా మారింది. ఏపీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు చేశారని కుట్రపూరితంగా తెరపైకి తేవడం, దానిపై ఎలాగైనా వైసీపీ నేతలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించి ఇరుకున పెట్టాలనే ప్రయత్నాలు చాప కింద నీరులా సాగుతూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జిందర్ పాల్ సింగ్‌పై నమోదైన దేశ ద్రోహం కేసుకు సంబంధించి విచారణలో భాగంగా గురువారం జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు …పరోక్షంగా ఏపీ ప్రభుత్వ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని ఎల్లో మీడియా సరికొత్త వాదనను తెరపైకి తేవడం గమనార్హం. ఎల్లో మీడియా అత్యుత్సాహాన్ని, దురుద్దేశాల్ని పక్కన పెడితే …సదరు మీడియా అభిప్రాయం ప్రకారం సుప్రీం చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు టీడీపీ ప్రభుత్వానికి, అలాగే వాళ్లు సానుభూతి వ్యక్తం చేస్తున్న ఉన్నతాధికారులకు చెంప పెట్టు అనే మెజార్టీ అభిప్రాయం లేకపోలేదు.
“అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు తదనంతర కాలంలో ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారు. దేశంలో పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయి. ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నపుడు పోలీసు అధికారులు ఓ పార్టీ పక్షం వహిస్తే, ఆ తర్వాత మరొక కొత్త పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పోలీసు అధికారులపై ఆ కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇది కొత్త రకం ధోరణి. దీనిని ఆపాలి” అని జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై ఎల్లో మీడియా భాష్యం ఏంటో చూద్దాం.
“సీజేఐ జస్టిస్ రమణ వ్యాఖ్యలు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను ప్రస్తావించినట్లయింది. 2019కి పూర్వం వివిధ పదవులు నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుండడాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బాధితుల్లో ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా పని చేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్, మరో ఉన్నతాధికారి జాస్తి కృష్ణ కిశోర్ ఉన్నారు”
జగన్ ప్రత్యర్థి పార్టీల నాయకులు, మీడియా వాదన ప్రకారం… ఏబీ వేంకటేశ్వరరావు, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, జాస్తి కృష్ణ కిశోర్‌లు గతంలో అధికార పార్టీకి అంటకాగారని సర్టిఫికెట్ ఇవ్వదలుచుకున్నారా? అప్పుడు అధికార పార్టీకి గులాం గిరి చేయడం వల్లే …ఆ తర్వాత కొత్త పార్టీ అధికారంలోకి రాగానే ఏపీలో ఈ ముగ్గురు ఉన్నతాధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలను అన్వయించారా? అలాగే అధికార పార్టీకి ఊడిగం చేసే ధోరణి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో మారాలని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యల నుంచి ఎందుకు తీసుకోకూడదు? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
జస్టిస్ ఎన్వీ రమణ దేశ వ్యాప్త పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సీరియస్ కామెంట్స్ చేస్తే …వాటిని తమ స్వార్థానికి వాడు కోవడం ద్వారా… అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించినట్టా? అగౌరవిస్తున్నట్టా? ఎందుకీ దిగజారుడుతనం? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.