ఒకే ఒక్క చెట్టు.. 121 రకాల మామిడి పండ్లు

ఒక మామిడి చెట్టుకు ఒకే రకమైన మామిడి కాయలు కాస్తాయి. అంటుకడితే 2-3 రకాల మామిడికాయలు కాచే చెట్లు కూడా ఉన్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ లో ఓ మామిడి చెట్టుకు ఏకంగా 121 రకాల…

ఒక మామిడి చెట్టుకు ఒకే రకమైన మామిడి కాయలు కాస్తాయి. అంటుకడితే 2-3 రకాల మామిడికాయలు కాచే చెట్లు కూడా ఉన్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ లో ఓ మామిడి చెట్టుకు ఏకంగా 121 రకాల మామిడి కాయలు కాచాయి. ఇండియన్ హార్టికల్చర్ లో దీన్నొక రికార్డ్ గా చెబుతున్నారు.

తోట పనిలో అంటుకట్టడం అనే ప్రక్రియ సర్వసాధారణం. చాలామంది రైతులు చేసేదే ఇది. కానీ ఒక కొమ్మతో, ఇంకో కొమ్మను అంటుకట్టడంతోనే చాలామంది ఆపేస్తారు. ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్ పూర్ కు చెందిన హార్టికల్చర్ ఉద్యోగులు మాత్రం కొత్తతరహా ప్రయోగం చేయాలని నిర్ణయించారు.

10 ఏళ్ల వయసున్న ఓ మామిడి చెట్టును ఎంపిక చేసుకొని, దానికి ఒక్కో కొమ్మకు, ఒక్కో జాతికి చెందిన మామిడి కొమ్మను అంటుకట్టడం ప్రారంభించారు. అలా 121 మామిడి జాతుల కొమ్మల్ని ఈ చెట్టుకు అంటుకట్టారు.

గడిచిన ఐదేళ్లుగా ఈ చెట్టును పరిరక్షిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఈ మామిడిచెట్టు ఫలితాల్ని ఇచ్చింది. ఏకంగా 121 రకాల మామిడి పండ్లను అందించింది. తమ ప్రయోగం సక్సెస్ అయినందుకు సిబ్బంది ఎంతో సంతోషిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త మామిడి రకాలపై పరిశోధనలు చేసేందుకు ఈ చెట్టు ఎంతగానో పనికొస్తుందంటున్నారు.

చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడీ చెట్టు ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీన్ని చూసేందుకు చాలామంది హార్టికల్చర్ ట్రయినింగ్ సెంటర్ కు వస్తున్నారు.