ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడిన వారిలో తెలంగాణ మంత్రులు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఉండటం గమనార్హం. వైఎస్ పేరుకు తెలంగాణలో డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. వైఎస్ ను ఓన్ చేసుకోవడానికి ఇప్పుడిప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదట్లోనేమో తామంతా సోనియా బొమ్మ తో నెగ్గిన వాళ్లమని, వైఎస్ తో తమకు సంబంధం లేదని కొంతమంది కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ఆ మాటలకు తగిన మూల్యాన్ని వాళ్లు చెల్లిస్తూ వస్తున్నారు. అందుకే టీ కాంగ్రెస్ నేతలు రూటు మార్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు వైఎస్ జగన్ ను ప్రశంసిస్తున్నారు.
ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి నేతలుగా చలామణిలో ఉన్న వాళ్లు వైఎస్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన విగ్రహాలకు దండలేసి వీళ్లు నివాళి ఘటించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీలకు అతీతులని తెలంగాణ రాష్ట్ర సమితిలోని నేతలు అంటుండటం గమనార్హం.
తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు వైఎస్ఆర్ సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ కు వీళ్లు జై కొట్టారు. వీళ్లు వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహిత నేతలుగా పేరు పొందారు. తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరినా ఇప్పుడు వైఎస్ఆర్ ను వీరు స్మరించగలుగుతున్నారు.