జగన్ కు రోజుకి 48 గంటలా..?

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని అందరూ పని రాక్షసుడు అనేవారు. ఆ పేరుకి తగ్గట్టే ఆయన బిల్డప్ కూడా ఉండేది. ఏ సమస్యా లేకపోయినా ఆయన కోసం వార్ రూమ్ లు సిద్ధంగా ఉండేవి.…

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని అందరూ పని రాక్షసుడు అనేవారు. ఆ పేరుకి తగ్గట్టే ఆయన బిల్డప్ కూడా ఉండేది. ఏ సమస్యా లేకపోయినా ఆయన కోసం వార్ రూమ్ లు సిద్ధంగా ఉండేవి. పొరపాటున సమస్య వస్తే ఆఫీస్ లోనే తిష్టవేసి 24 గంటల లైవ్ మానిటరింగ్ చేస్తూ, అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ, టెలి, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ రెచ్చిపోయేవారు బాబు. ఇదంతా చేసిన ఫలితం కోసం కాదు, ఫ్లెక్సీల కోసమనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప చంద్రబాబు చేసే పనులకు రిజల్ట్ కనిపించేది కాదు.

ఇక జగన్ విషయానికొద్దాం. అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ ఆయన పంథాయే వేరు. ఎన్నికల హామీలో ఉన్న నవరత్నాల పథకానికి సరైన రూపురేఖలు లేవు. అయితేనేం.. అధికారం చేపట్టి ఏడాది తిరిగేలోగా నెలకో పథకం చొప్పున అమలులోకి తీసుకొచ్చారు. అంటే ఆ నెలరోజుల్లో ఆ పథకానికి అర్హత, అమలు తీరు, లబ్ధిదారుల ఎంపిక, నగదు బదిలీ.. వంటివాటిపై ఎంత కసరత్తు జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఒక టీమ్ ఒక పథకం పని పూర్తి చేసేలోపు, ఇంకో టీమ్ మిగతా వాటికి బ్లూ ప్రింట్ తయారు చేసేది. ఇందుకోసం రిటైర్డ్ ఐఏఎస్ లు అజేయకల్లం లాంటి నమ్మకస్తుల్ని ఏరికోరి మరీ తీసుకున్నారు సీఎం జగన్. వీటితో పాటుగా.. సచివాలయాల ఉద్యోగాల భర్తీ, వాలంటీర్ల నియామకం, కొత్త సచివాలయాల నిర్మాణం, ఇన్ ఫ్రా స్ట్రక్చర్.. అన్నీ సమాంతరంగా పూర్తయ్యాయి. అంటే జగన్ ఒకే సారి వంద పనులపై కాన్సన్ట్రేషన్ పెట్టినా అన్నిటినీ విజయవంతంగా పూర్తి చేస్తున్నారన్నమాట.

ఇక కరోనా విషయానికొద్దాం. కొత్తగా అధికారం చేపట్టిన తమిళనాడు, మహారాష్ట్ర సీఎంలే కాదు, అప్పటికే వ్యవస్థపై పూర్తిగా పట్టు సాధించిన కేసీఆర్, కేజ్రీవాల్, యడ్యూరప్పలాంటివారు కూడా కరోనా కష్టకాలంలో దిక్కుతోచక అల్లాడుతున్న పరిస్థితుల్లో జగన్ ఏపీలో కరోనాని విజయవంతంగా ఎదుర్కోగలుగుతున్నారు. మిగతా రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ వ్యాధి నిర్థారణ పరీక్షలు జరిగాయి. క్వారంటైన్ సెంటర్ల వసతిగానీ, ఐసోలేషన్ బెడ్స్ కానీ.. ఏపీలోనే నాణ్యమైన వైద్యం అందుతుందనే భావన ఇతర రాష్ట్రాల ప్రజల్లో కూడా ఉంది.

అటు సంక్షేమ కార్యక్రమాలు, ఇటు విపత్తు నివారణ చర్యలు, మరోవైపు కోర్టుల తలనొప్పులు.. ఇన్ని విషయాలను ఒక కొత్త సీఎం ఎలా తట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. పథకాల అమలుతో పాటు.. ప్రతి రోజూ మంత్రులు, అధికారులతో పాలనపై సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం. అందరికీ రోజుకి 24 గంటలయితే, జగన్ కి మాత్రం రోజుకి 48గంటలున్నాయేమోననే అనుమానం కలగకమానదు. అందే కాదు.. సీనియర్ అధికారులకు ఆయన పని విభజన చేసిన తీరు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. అధికారులందర్నీ టీమ్ లు గా విడగొట్టి.. వారికి ఒక్కో పథకం అమలు తీరుని బాధ్యతగా అప్పగించారు. దీంతో జగన్ పాలన ఆటంకాలు లేకుండా సాగుతోంది.

పనుల్ని విభజించారు కాబట్టే, పాలన సజావుగా చేస్తున్నారు సీఎం జగన్. చంద్రబాబుది హడావిడి అయితే, జగన్ ది ప్లానింగ్. ఆయన మాటల మనిషి, ఈయన చేతల సీఎం. అదీ తేడా.

రైతు దినోత్సవం

మోహన్ బాబు కూడా ఫోన్ చేశారు, కానీ నా దేవుడు చెయ్యలేదు