కరోనా మహమ్మారితో ప్రపంచంలో 70 శాతం లాక్ డౌన్ లో ఉంది. అగ్రరాజ్యం అమెరికా కూడా దీనికి అతీతం కాదు. ఇంకా చెప్పాలంటే వైరస్ ప్రభావం ఎక్కువగా అమెరికాలోనే ఉంది. ఇలా కొన్ని దేశాలు పాక్షికంగా, మరికొన్ని దేశాలు పూర్తిగా లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ తర్వాత పరిస్థితేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ విషయంలో ఒక్కో దేశం ఒక్కో పద్ధతిని ఫాలో అవుతున్నాయి. ఇండియాలోనైతే 20 నుంచి లాక్ డౌన్ ను పాక్షికంగా కుదించేలా ప్రణాళిక సిద్ధంచేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు అనుమతినిచ్చారు. ఉపాధి హామీ పథకాలు ప్రారంభించుకోవచ్చన్నారు. నిత్యావసరాలు అమ్మే కిరాణ దుకాణాలకు అనుమతి ఇచ్చారు. అయితే షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు, సినిమా హాళ్లు, ఇతర పెద్ద వ్యాపారాలు మాత్రం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ లో ఉంటాయి. దీనికి కంప్లీట్ రివర్స్ లో ఉంది అమెరికా ప్లానింగ్.
అవును.. లాక్ డౌన్ ను మూడు దశల్లో ఎత్తివేయాలని నిర్ణయించిన ట్రంప్.. తొలిదశలోనే దేశవ్యాప్తంగా థియేటర్లు తెరవాలని నిర్ణయించారు. కేవలం థియేటర్లు మాత్రమే కాదు, రెస్టారెంట్లు, క్రీడా ప్రాంగణాలు, చర్చ్ లు కూడా తెరుచుకోవచ్చని శెలవిచ్చారు. వాణిజ్యరంగాన్ని, వినోదరంగాన్ని బలోపేతం చేసేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎక్కువమంది మాత్రం ఈ డెసిషన్ ను వ్యతిరేకిస్తున్నారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. థియేటర్లు, రెస్టారెంట్లలో సోషల్ డిస్టెన్స్ పాటించినప్పటికీ.. అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అటు ట్రంప్ మాత్రం థియేటర్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం మాత్రం గవర్నర్లదే. ట్రంప్ నిర్ణయంపై ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా స్పందించబోతున్నాయి.
ట్రంప్ నిర్ణయానికి గవర్నర్లు మద్దతు తెలిపినప్పటికీ.. ఉన్నఫలంతా మాల్స్, థియేటర్లు తెరవడానికి సంస్థలు సముఖంగా లేవు. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు తమ పెద్ద సినిమాల విడుదల తేదీల్ని వాయిదా వేసుకోగా.. ఇటు మల్టీప్లెక్స్ కంపెనీలు ప్రేక్షకుల్ని తక్కువ సీటింగ్ కు పరిమితం చేస్తూ చర్యలు తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాయి. ఎందుకంటే పెద్ద సినిమాల సందడి లేదు కాబట్టి, సినిమా హాళ్లు తెరిచినా నష్టాలు తప్పవు, మూసి ఉంచినా నష్టాలు తప్పవు.
ఇటు ఇండియాలో మాత్రం మరో ఆలోచనకు తావు లేకుండా వ్యవహరిస్తోంది మోడీ సర్కార్. ప్రజారోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తూనే.. వ్యవసాయం, పరిశ్రమలకు మలి ప్రాధాన్యం ఇచ్చింది. షాపింగ్ మాల్స్, థియేటర్ల గురించి ఏ కోశాన ఆలోచించడం లేదు. అంతెందుకు.. మే 3 తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ఇండియాలో థియేటర్లు-మల్టీప్లెక్సులు పూర్తిస్థాయిలో తెరుచుకుంటాయని గట్టిగా చెప్పలేని పరిస్థితి.
కరోనా వల్ల వినోద రంగం భారీగా నష్టాలు చవిచూస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుమించిన మార్గం లేదు. ఎందుకంటే ఇక్కడ థియేటర్లు, షాపింగ్ మాల్స్ కు తొలి దశలో అనుమతి ఇస్తే.. కరోనా విషయంలో ఇండియా మరో అమెరికాలా మారడం గ్యారెంటీ.