కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి ? లాక్ డౌన్ ఒక్కటే మార్గం. ఎవరి ఇళ్లలో వారు ఉండటమే మందు. ఎందుకంటే కరోనాకు ఇప్పటివరకు వ్యాక్సిన్ కనిపెట్టలేదు కాబట్టి. అగ్రరాజ్యమైన అమెరికా అయినా, దాని ముందు ఎలుకలా కనబడే చిన్న దేశమైనా ఒకటే పని చేస్తున్నాయి. అదే లాక్ డౌన్. మార్చిలో తెలంగాణలో సీఎం కేసీఆర్ మొట్టమొదట మీడియా సమావేశం పెట్టి లాక్ డౌన్ ప్రకటించినప్పుడు కాస్త ప్రజలను భయపెట్టే విధంగానే మాట్లాడారు.
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే లాక్ డౌన్ కు మించిన మందు లేదని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ సందర్భంగానే ఆయన లాక్ డౌన్, స్వీయ నియంత్రణ పాటించకపోతే, నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల మీద తిరిగితే షూట్ ఎట్ సైట్ (కనిపిస్తే కాల్చివేత) ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని, అవసరమైతే ఆర్మీని రంగంలోకి దింపుతామని, కాబట్టి పరిస్థితిని అంతవరకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు.
కరోనా వ్యాప్తి చెందితే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికే కేసీఆర్ గట్టి హెచ్చరిక చేశారు తప్ప నిజంగానే కాల్చి చంపుతారనే అర్థం కాదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె జరిగినప్పుడు సమ్మెలో ఉన్న కార్మికులందరి ఉద్యోగాలు ఆటోమేటిగ్గా పోయినట్లేనని, దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించారు. కానీ ఎవరి ఉద్యోగాలు పోలేదు.పైగా ఉద్యోగ విరమణ వయసు పెంచారు. కేసీఆర్ ఇలాంటి గిమ్మిక్స్ చేయడంలో దిట్ట. లాక్ డౌన్ ప్రకటించినప్పుడు కూడా షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇస్తామంటూ చెప్పారు. కానీ ఆ తరువాత రోడ్ల మీదికి వచ్చేవారికి పోలీసులు దండాలు పెడుతూ బతిమాలారు. ఇంటోనే ఉండాలని వేడుకున్నారు.
కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కాస్త దురుసుగా, కఠినంగా వ్యవహరించినా ఎక్కువ శాతం ఓపిగ్గానే ఉన్నారు. తెలంగాణలోనే కాదు, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జనం ఓవర్ యాక్షన్ చేసినా కాల్పుల దాకా పరిస్థితి రాలేదు. ఒకవేళ పరిస్థితి అలా వచ్చి ఉంటే సీఏఎకు వ్యతిరేకంగా జరిగిన లెవెల్లో ఆందోళనలు జరిగేవి. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి.
షూట్ ఎట్ సైట్ అని కేసీఆర్ ఊరికే అంటే పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియాలో మాత్రం ఆ పని అక్కడి పోలీసులు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు. ఇతర దేశాల మాదిరిగానే అక్కడా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. సహజంగానే కొందరు లాక్ డౌన్ ఉల్లంఘిస్తారు కదా. అలా చేసిన 18 మందిని భద్రతా దళాలు కాల్చిచంపాయి. జనం లాక్ డౌన్ ఉల్లంఘిస్తే భద్రతా దళాలు మానవహక్కులు ఉల్లంఘించాయి.
నిబంధనలు ఉల్లంఘించినవారిని కాల్చి చంపినట్లు మరే దేశంలో వార్తలు రాలేదు. నైజీరియా మానవ హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. భద్రతా దళాలు మానవ హక్కులను ఉల్లంఘించినట్లు తమకు 105 ఫిర్యాదులు అందాయని ఆ దేశపు మానవ హక్కుల కమిషన్ తెలిపింది. కరోనా వల్ల 12 మంది చనిపోతే, పోలీసు కాల్పుల్లో 18 మంది చనిపోయారు.
నైజీరియాలో భద్రతా దళాల మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. లాక్ డౌన్ పేరుతో ప్రజలను అనేక విధాలుగా వేధిస్తున్నారు. జనం అసలే లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతుంటే భద్రతా దళాలు, పోలీసులు లంచాలు అడుగుతున్నారు. ఇదీ నైజీరియాలో సంగతి.