అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రెసిడెంట్ కాకముందు ఓ పెద్ద వ్యాపారవేత్త. అయితే అధ్యక్షుడిగా మారిన తర్వాత కూడా ఆయన బిజినెస్ మేన్ లానే ఆలోచిస్తున్నారు. ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి ఆర్థికంగా లెక్కలేసుకుంటున్నారు. ప్రస్తుతం ట్రంప్ పై వినిపిస్తున్న ప్రధానమైన విమర్శ ఇది.
కరోనా కారణంగా ప్రపంచమంతా లాక్ డౌన్ అయింది. కానీ ట్రంప్ మాత్రం అమెరికాను లాక్ డౌన్ చేయడానికి ఇష్టపడడం లేదు. కేవలం ఆర్థికంగా నష్టపోతామనే ఆలోచనతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో అమెరికాలో ఊహించని విధంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.
ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల్లో అగ్రరాజ్యానిదే అగ్రస్థానం. ఈ విషయంలో చైనాను మించిపోయింది అమెరికా. ప్రస్తుతం యూఎస్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. నిన్న ఒక్కరోజే 13వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మరోవైపు అమెరికాలో డొల్లతనం కూడా బయటపడింది. అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే అమెరికాలో ప్రస్తుతం వెంటిలేటర్లకు కొరత ఏర్పడింది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో, బాధితులకు సరైన ట్రీట్ మెంట్ అందించడంలో అమెరికా విఫలమౌతోందంటూ స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందంటే అమెరికా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికైనా ట్రంప్ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వ్యాపారం, వాణిజ్యం కంటే ప్రజల ప్రాణాలు విలువైనవనే విషయాన్ని గ్రహించాలి. ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించాలి. లేదంటే.. ఇటలీకి ఎదురైన అనుభవాన్నే అమెరికా కూడా చవిచూడాల్సి వస్తుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల 11వేల 600కు చేరింది. ఇప్పటివరకు 23వేల 67 మంది చనిపోయారు. ఇటు భారత్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. 722కు కరోనా పాజిటివ్ కేసులు పెరగగా.. 17 మంది మరణించారు. 66 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరగా.. ఆంధ్రప్రదేశ్ లో 11కు చేరింది.