ఇప్పుడు కాదు కానీ, బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగే రోజుల్లో.. ఇండియాలో ఎన్నికల రచ్చ మామూలుగా ఉండేది కాదు! పంచాయతీ ఎన్నికల్లో అయితే.. గ్రూపు రాజకీయాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి.
పోలింగ్ తమకు అనుకూలంగా జరగలేదు అనే లెక్కలు వచ్చినప్పుడు కొంతమంది తమ మనుషులను బూత్ లలోకి పంపి బ్యాలెట్ బాక్సుల్లోకి ఇంకు పోయడం, నీళ్లు పోయడం వంటి పనులు చేయించే వారు! ఓటింగ్ ముగుస్తున్న సమయంలో అలాంటి పనులు చేస్తే.. రచ్చరచ్చ జరిగేది!
అయితే రోజులు మారాయి. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ బ్యాలెట్ల మీదే జరుగుతున్నా.. ఇండియాలో అలాంటి తకరారు పనులు చేసే సామాన్యులు తక్కువయ్యారు. ఇప్పుడు నేతలే.. ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు రేకెత్తేలా మాట్లాడుతుంటారు కానీ, సామాన్యులు వ్యవస్థకు గౌరవం ఇచ్చే దశకు వచ్చారు, భారతదేశంలో.
విశేషం ఏమిటంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ లో రేగుతున్న వివాదాలు కొన్ని సిల్లీగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో, పురాతన ప్రజాస్వామ్యంలో ఇలాంటి వివాదాలా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి సగటు భారతీయుడికి.
ఇండియాలో పోలింగ్ ప్రక్రియ మీద అయినా నేతలు ఆరోపణలు చేసుకుంటారు కానీ, కౌంటింగ్ రోజుకు లెక్కలేసుకోవడం తప్ప నంబర్లను మార్చేస్తున్నారంటూ రచ్చ ఉండదు. మిషన్ నంబర్లు కావడంతో.. వివాదాలు ఉండటం లేదు.
అమెరికాలో ఇప్పుడు ట్రంప్ మద్దతు దారులు కౌంటింగ్ ప్రక్రియ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, కోర్టుకు వెళ్లారు. మూడు రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ పట్ల అభ్యంతరం తెలిపారు. అసలు కౌంటింగే ఆపాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ట్రంప్ మద్దతు దారులు కొందరు రోడ్లెక్కారు.
కౌంటింగ్ స్టేషన్లను వారు ముట్టడించినట్టుగా తెలుస్తోంది! ట్రంప్ తరఫున కౌంటింగ్ ఏజెంట్లను లోపలకు రానివ్వడం లేదని కూడా వారు ఆరోపిస్తున్నారు!
ఈ ఆరోపణ వింటే.. దశాబ్దాల కిందటి భారతదేశంలో కౌంటింగ్ ప్రక్రియలు గుర్తుకు రాకమానవు. అది కూడా పంచాయతీ ప్రెసిడెంట్ స్థాయి ఎన్నికల్లోనే ఆ తరహా రచ్చలుండేవి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎన్నిక ఒకప్పటి మన పంచాయతీ ప్రెసిడెంట్ల ఎన్నికల ప్రక్రియను గుర్తు చేస్తోంది!