అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఇండియన్స్ ఎంతో సీరియస్ గా తీసుకున్నారు పాపం! మోడీ అభిమానులు అయితే.. ఉత్తరాదిన ట్రంప్ గెలవాలని పూజలు, యాగాలు చేస్తున్నారు! సగటు ఆంధ్రుడు కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అప్ డేట్స్ కోసం తెగ సెర్చ్ చేస్తున్నాడు! తెలుగు వార్తా పత్రికలు పేపర్లకు పేపర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు కేటాయించాయి!
కేవలం ఇండియా అనే కాదు.. ప్రపంచమంతా అమెరికాకు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారనే అంశం గురించి ఉత్కంఠతో ఎదురుచూస్తోంది! రష్యా, చైనా లకు కూడా ఈ ఆసక్తి తప్పడం లేదు.
రష్యా, చైనాల విషయంలో అయితే సంచలన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ దేశాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ నే ప్రభావితం చేస్తారనే ఆరోపణలు, అభిప్రాయాలున్నాయి!
మరి అమెరికా ఆవల ఇంత రచ్చ జరుగుతున్న ఎన్నికలో అమెరికన్ల భాగస్వామ్యం ఎంత? అంటే కాస్త ఆశ్చర్యపోయే విషయమే అవుతుంది. ఇప్పటి వరకూ వేసిన లెక్కల ప్రకారం.. ఈ ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకున్న అమెరికన్ ఓటర్ల శాతం 67 మాత్రమే! ఓటు హక్కును కలిగిన వారిలో 67 శాతం మంది మాత్రమే తమ హక్కును ఉపయోగించుకున్నారు!
ఈ పోలింగ్ శాతం ఇండియాతో పోల్చినా తక్కువే. ఇండియా వంటి దేశంలో.. దక్షిణాది రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడు 75 శాతం వరకూ పోలింగ్ నమోదవుతూ ఉంటుంది.
80 శాతానికి కూడా కొన్ని చోట్ల రీచ్ అవుతుంటుంది! ఇంకా ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల కమిషన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది! అమెరికా కన్నా ఎంతో వెనుకబడిన ఇండియాలో కూడా ఓటేయడానికి జనాలు పొలోమని క్యూ కడుతూ ఉంటారు.
అయితే ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశంలో, స్వతంత్రాన్ని తనివితీరా అనుభవించే తత్వం ఉన్న అమెరికన్లు మాత్రం ఓటేయడానికి మరీ గొప్ప ఆసక్తి చూపడం లేదు. 67 శాతం అంటే.. కచ్చితంగా తక్కువ పర్సెంటేజే అవుతుంది.
మరింత విశేషం ఏమిటంటే.. గత వందేళ్లలో అమెరికాలో ఎప్పుడూ ఇంత పోలింగ్ శాతం నమోదు కాలేదట! 67 శాతం పోలింగ్ నమోదు కావడమే ఒక కొత్త రికార్డు అట!