కంగ‌నా అరెస్టు కూడా త‌ప్ప‌దా?

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణంపై తీవ్ర రాజ‌కీయం చేసిన వారిలో ముందు వ‌ర‌స‌లోని వారిగా పేరు తెచ్చుకున్నారు కంగ‌నా ర‌నౌత్, అర్న‌బ్ గోస్వామి. టైమ్స్ నౌ చాన‌ల్ వాళ్లు కూడా…

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణంపై తీవ్ర రాజ‌కీయం చేసిన వారిలో ముందు వ‌ర‌స‌లోని వారిగా పేరు తెచ్చుకున్నారు కంగ‌నా ర‌నౌత్, అర్న‌బ్ గోస్వామి. టైమ్స్ నౌ చాన‌ల్ వాళ్లు కూడా ఈ వ్య‌వ‌హారంపై చాలా హ‌డావుడి చేశారు.

ఇదంతా టార్గెట్ శివ‌సేన స‌ర్కారు, టార్గెట్ బాలీవుడ్ అనే స్ప‌ష్ట‌మైన ఉద్దేశాల‌తో జ‌రిగింద‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్తం అయ్యాయి. 

సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన వారంటూ బోలెడంత మందిపై విరుచుకుప‌డిన అర్న‌బ్ గోస్వామి ఇప్పుడు మ‌రొక‌రి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌య్యార‌నే అభియోగాల‌తో అరెస్టు కావ‌డం గ‌మ‌నార్హం.

ఇది పాత కేసే అయినా.. అప్ప‌ట్లో అర్న‌బ్ త‌న ప‌ర‌ప‌తిని ఉప‌యోగించుకుని చ‌ర్య‌లేం లేకుండా చేసుకున్నాడ‌ని, ఇప్పుడు ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింద‌నే మాట వినిపిస్తూ ఉంది. సుశాంత్ ఎలాంటి సూసైడ్ నోట్ రాయ‌క‌పోయినా.. బోలెడంత మందిపై అనేక మంది విరుచుకుప‌డ్డారు. ఇప్పుడు ఒక సూసైడ్ నోట్ అర్న‌బ్ పేరు  ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి దీన్నెలా చూస్తారో అప్పుడు సుశాంత్ మ‌ర‌ణంపై తీవ్ర రాద్ధాంతం చేసిన వారు!

ఇక సుశాంత్ పై ట‌న్నుల కొద్దీ సానుభూతి వ్య‌క్తం చేసిన కంగ‌నా ర‌నౌత్ అర్న‌బ్ గోస్వామి అరెస్టును తీవ్రంగా ఖండించింది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని అనేక మందిపై విరుచుకుప‌డిన ఈమె, మ‌రొక‌రి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌య్యాడ‌నే అభియోగాల‌ను ఎదుర్కొంటున్న అర్న‌బ్ పై మాత్రం సానుభూతి వ్య‌క్తం చేస్తోంది. ఈ మార్పుకు కార‌ణ‌మేమిటో విశ‌దీక‌రించ‌న‌క్క‌ర్లేదేమో!

ఆ సంగ‌త‌లా ఉంచితే.. కంగ‌నాపై ముంబైలో ఒక కేసు న‌మోదైంది. అది కూడా కోర్టు ఆదేశాల మేర‌కు న‌మోదైన కేసు! మ‌తాల మ‌ధ్య‌న చిచ్చుపెట్టేలా వ్యాఖ్యానించింద‌నే అభియోగాల‌ను కంగ‌నా, ఆమె సోద‌రి రంగోలీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ క్ర‌మంలో కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు కాగా, కోర్టు ఆదేశాల మేర‌కు ముంబై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. 

ఈ కేసుల విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఇప్ప‌టికే ముంబై పోలీసులు రెండు సార్లు కంగ‌నా, ఆమె సోద‌రికి నోటీసులు జారీ చేశారు. అయితే వారు మాత్రం విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. ఈ నెల ప‌దో తేదీ వ‌ర‌కూ మ‌రోసారి గ‌డువిచ్చిన‌ట్టుగా ఉన్నారు.

మ‌రి త‌న‌ను తాను ఝాన్సీరాణిగా చెప్పుకున్న కంగ‌నా విచార‌ణ‌కు హాజ‌ర‌వుతుందో, ముంద‌స్తు బెయిల్  కోరుతుందో, లేక మ‌రోసారి ఆ నోటీసుల‌ను లెక్క చేయ‌క వ్య‌వ‌హ‌రిస్తుందో. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఈమె ముంబైలో అడుగుపెడితే మాత్రం.. అర్న‌బ్ ను అరెస్టు చేసిన‌ట్టుగానే కంగ‌నాను కూడా అరెస్టు చేయ‌వ‌చ్చ‌నే టాక్ న‌డుస్తోంది!

బాబు జూమ్ సౌండుకి, వైసిపీ నో రీసౌండ్