వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. ఇది ప్రపంచ దేశాలు ఇచ్చే నిధులతో నడిచే సంస్థ. అయితే ప్రస్తుత కరోనా వైరస్ కష్ట కాలంలో ఈ సంస్థ తీరు అనేక అనుమానాలను కలిగించేలా, అత్యంత ఆందోళన కరంగా ఉంది. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉండే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏమిటంటే.. కరోనా వైరస్ లాంటివి ప్రపంచాన్ని అటాక్ చేస్తున్న సమయంలో ఆయా దేశాలను అలర్ట్ చేయడం. ఇలాంటి వైరస్ ల వ్యాప్తి పరిస్థితులను గమనించి.. ప్రపంచ దేశాలకు వాటి గురించి తెలిపి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు -సూచనలు ఇవ్వడమే డబ్ల్యూహెచ్వో పని. దీనికి కోసమే.. అనేక దేశాలు దాన్ని పోషిస్తున్నాయి.
అయితే చైనాలో గత ఏడాది నవంబర్- డిసెంబర్ ల సమయంలో కరోనా వ్యాప్తి ప్రబలిన సమయంలో డబ్ల్యూహెచ్వో ఏం చేసింది? సరే, నవంబర్-డిసెంబర్ల సంగతెలా ఉన్నా.. చైనాలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించిన జనవరి-ఫిబ్రవరి నెలల్లో అయినా డబ్ల్యూహెచ్ వో ప్రపంచ దేశాలను అలర్ట్ చేసిందా? కరోనా చైనాలో సృష్టిస్తున్న కల్లోలాన్ని గుర్తించి.. మిగతా దేశాలను అలర్ట్ గా ఉండాలని డబ్ల్యూహెచ్ వో చెప్పిందా? అంటే.. అలాంటిదేమీ లేదు!
అంతకన్నా దారుణం ఏమిటంటే.. కరోనా మనిషి నుంచి మనిషికి వ్యాపించిందని మొదట్లో డబ్ల్యూహెచ్వో వాదించిందని తెలుస్తోంది. చైనాలో కరోనా ఆదిలో ఉన్నప్పుడు.. కరోనా వైరస్ వెనకేసుకు వచ్చింది డబ్ల్యూహెచ్ వో. ఆ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాపించిందని చెప్పుకొచ్చింది. అంత దారుణమైన అబద్ధాన్ని ప్రపంచానికి చెప్పింది ఈ సంస్థ.
అంతే కాదు.. కరోనా బారిన పడిన చైనాతో విమానయాన సంబంధాలను తెంచుకోవాల్సిన అవసరం లేదని, చైనాతో యథాతథంగా వ్యవహరించవచ్చని కూడా సర్టిఫికెట్ ఇచ్చింది ఈ దుర్మార్గపు సంస్థ. ఈ విషయాన్నే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తావిస్తున్నారు. అంతే కాదు.. ఇక నుంచి డబ్ల్యూహెచ్ వోకు నిధులను కూడా ఆపేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ విషయంలో డబ్ల్యూహెచ్వో తీరుపై విచారణ కూడా చేయించనున్నట్టుగా ప్రకటించారు.
నిస్సందేహంగా ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించవచ్చు. ఈ డబ్ల్యూహెచ్ వోను చైనా మేనేజ్ చేసిందని, డబ్ల్యూహెచ్ వో అధ్యక్షుడిగా ఉన్నవాడు పూర్తిగా చైనా బానిస అని, చైనా ఓటు ద్వారా అతడు ఆ పదవిని తీసుకున్నాడని.. అందుకే కరోనా ఆరంభంలో చైనాను వెనకేసుకు వచ్చి.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్నీ కరోనా బారిన పడేశాడని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు కథ ఏమిటనే అంశం గురించి కరోనా తగ్గుముఖం పట్టాకా ప్రపంచ దేశాలు దృష్టి సారించే అవకాశం ఉంది. అయినా ప్రపంచ దేశాల ఆరోగ్యాలను రక్షించడానికి అంటూ ఏర్పాటై.. ఇలా ప్రపంచాన్ని కబలించే పరిస్థితులకు కల్పించాకా ఈ డబ్ల్యూహెచ్ వో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి?