టీటీడీలో కోల్డ్ వార్: రమణ దీక్షితులు Vs సుబ్బారెడ్డి

కరోనా నేపథ్యంలో ఓ దఫా తిరుమల శ్రీవారి దర్శనాలకు బ్రేక్ పడింది. అన్ లాక్ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకుని భక్తుల దర్శనాలకు అనుమతిచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అందులోనూ…

కరోనా నేపథ్యంలో ఓ దఫా తిరుమల శ్రీవారి దర్శనాలకు బ్రేక్ పడింది. అన్ లాక్ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకుని భక్తుల దర్శనాలకు అనుమతిచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అందులోనూ టీటీడీ సిబ్బంది కరోనా బారిన పడటం మరింత అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. అయితే అదే సమయంలో దర్శనాలను ఆపబోమంటూ టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయం చర్చకు తావిస్తోంది.

కొండపై 140మందికి కరోనా సోకిందని చెబుతున్న పాలకవర్గం.. దర్శనాల్ని మాత్రం కొనసాగిస్తామనడం కాస్త ఆశ్చర్యానికి తావిస్తోంది. కరోనా సోకిన వాళ్లలో 15 మంది అర్చకులు కూడా ఉన్నారు. క్యూలైన్లతో సహా ఆలయ పరిసరాల్లో నిత్యం శానిటైజేషన్ చేస్తున్నా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో రమణ దీక్షితులు వంటివారు దర్శనాల కొనసాగింపుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

15మంది అర్చకులు కరోనా బారిన పడ్డా దర్శనాలు ఆపబోమంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరుపై ఆయన ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. దర్శనాలపై సామాజిక మాధ్యమాల్లో చర్చలేవనెత్తడం సరికాదని హితవుపలికారు. రమణదీక్షితులతో మాట్లాడాలని అధికారులను పురమాయించారు.

ఈ ఇద్దరి వ్యాఖ్యలు టీటీడీలో గంభీర వాతావరణాన్ని నెలకొల్పాయి. ఇప్పటికే ముందస్తుగా దర్శనాల టికెట్లు తీసుకున్నవారిలో చాలామంది కొండకు రావడంలేదు. అలా అని భక్తులంతా భయంతో తిరుమలకు దూరంగా ఉంటున్నారని చెప్పలేం. రవాణా సౌకర్యాలు లేకపోవడమో, టికెట్లు తీసుకున్నాక తమ ప్రాంతం కంటైన్మెట్ జోన్లోకి వెళ్లడమో, స్నేహితులు, బంధువులు కరోనా బారిన పడటమో లేక స్వయంగా వారికే కరోనా సోకడమో.. ఇలా రకరకాల కారణాలున్నాయి.

భక్తుల విషయం పక్కనపెడితే.. రోజు రోజుకీ టీటీడీ సిబ్బందిలో కరోనా బారినపడేవారి సంఖ్య పెరగడం మాత్రం ఆందోళన కలిగించే విషయమే. భక్తులకు కరోనా రావడంలేదు కదా అని సరిపెట్టుకోవాలా లేక.. సిబ్బంది కరోనా బారిన పడుతున్నారని బాధపడాలా తెలియని పరిస్థితి. దర్శనాలు లేని రోజుల్లో టీటీడీ సిబ్బందికి కరోనా సోకినట్టయితే ఇంత చర్చ ఉండేది కాదు. ఓవైపు దర్శనాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి పునరాలోచించాలని రమణ దీక్షితులు, మరికొందరు కోరుతున్నారు.

ఈ వ్యవహారంపై టీటీడీ నిర్ణయమే ఇక మిగిలి ఉంది. లేదా సీఎం జగన్ జోక్యం చేసుకుంటారేమో వేచి చూడాలి.

బాలినేని మీద బురద చల్లొద్దు

టీటీడీలో 140 మందికి పాజిటివ్