చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం టీటీడీకి అలవాటుగా మారింది. టీటీడీ నిరర్థక ఆస్తుల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. టీడీపీ హయాంలో ఆస్తుల అమ్మకానికి సంబంధించి చేసిన నిర్ణయాన్ని అనవసరంగా తెరపైకి తెచ్చి…జగన్ సర్కార్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటోందనే అపప్రద విజయవంతంగా జనంలోకి వెళ్లింది. దీనికి టీటీడీ ఉన్నతాధికారులు, పాలక మండలి అనాలోచిత నిర్ణయాలే కారణమని చెప్పక తప్పదు.
ఇక తాజాగా అలాంటిదే తిరుమలలో దర్శనాలకు సంబంధించిన వ్యవహారం. తిరుమలలో దర్శనాలను నిలిపివేయండి మహాప్రభో అంటూ ప్రతి ఒక్కరూ మొత్తుకుంటుంటే టీటీడీ పాలకమండలి, ఉన్నతాధికారులు మాత్రం మీనమేషాలు లెక్కపెడు తున్నారు. తిరుపతి, తిరుమలలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.
చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు 4,850 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క తిరుపతిలోనే 2,089 కేసులు రికార్డు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరీ ముఖ్యంగా 158 మంది టీటీడీ ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. ప్రధాన అర్చకులు, వగపడి సిబ్బంది, అన్నదానం పోటు, విజిలెన్స్ సిబ్బందికి కరోనా మహమ్మారి సోకింది. అలాగే శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాల పర్యవేక్షకులు పెద్దజీయంగార్ కరోనా బారిన పడడంతో టీటీడీ ఉద్యోగుల్లో భయాందోళనలు తీవ్రమయ్యాయి.
కరోనాతో పరిస్థితి విషమిస్తున్నా టీటీడీ ధర్యకర్త మండలి, ఉన్నతాధికారులు మాత్రం దర్శనాల కొనసాగింపుపై “చూద్దాం…చేద్దాం” అంటూ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుండడంపై భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో నేటి నుంచి ఆ నగరంలో ఉదయం పది గంటలకే దుకాణాలు మూసివేయాలని నగర కమిషనర్ గిరీష ఆదేశించారు. మరోవైపు తిరుపతిలో టీటీడీ పరిపాలన కార్యాలయానికి ఉద్యోగులు మినహా మిగిలిన వారికి ఎంతో అవసరం ఉంటే తప్ప అనుమతించడం లేదు. అలాగే తిరుపతి అర్బన్, రూరల్ రెవెన్యూ కార్యాలయాలు దాదాపు మూసివేశారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలోకి కూడా అందరికీ అనుమతి లేదని సమాచారం.
ఈ నేపథ్యంలో దర్శనాల కొనసాగింపుపై టీటీడీ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నట్టు పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే స్వామివారి నిత్య కైంకర్యాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. చిన్నచిన్న కార్యాలయాలకే సంబంధించే అధికారులు ఎంతో అప్రమత్తతో వ్యవహరిస్తుంటే…ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఇంత ఉదాసీనత ఏంటో అర్థం కావడం లేదని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు వాపోతున్నారు.
కాగా దర్శనాల నిలిపివేతకు సంబంధించి సీఎం జగన్‌కు నివేదిక సమర్పించినట్టు తెలిసింది. జగన్ నిర్ణయంపై దర్శనాల భవిత ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో చేతులు కాలాకైనా…టీటీడీ ఆకులు పట్టుకుంటుందో లేదో చూడాలి మరి.