కరోనా కారణంగా టీటీడీ గతంలో ఆర్జిత సేవలను నిరవధికంగా వాయిదా వేసింది. క్రమక్రమంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి నిబంధనలు సడలిస్తున్నారు.
ఇటీవల ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్న టీటీడీ.. త్వరలో ఆర్జిత సేవలు కూడా మొదలు పెట్టబోతోంది. దీనికి సంబంధించి 2 రోజుల్లో ప్రకటన విడుదల చేస్తామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ బోర్డ్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభిస్తామంటూనే టికెట్ ధరలను పెంచుతున్నట్టు తెలిపారు వైవీ.
అన్నప్రసాదంపై కీలక నిర్ణయం..
తిరుమల వచ్చే భక్తులు క్యూలైన్లో వేచి చూసే సమయంలో కూడా అన్న ప్రసాదం స్వీకరిస్తారు. పాలు, ఇతర పానీయాలు కూడా వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అయితే కరోనా కారణంగా అన్నప్రసాదం, పాల వితరణను టీటీడీ ఆపేసింది. మళ్లీ ఇప్పుడు దాన్ని పునరుద్ధరించబోతోంది.
తరిగొండ వెంగమాంబ అన్నసత్రంతో పాటు.. మిగతా ప్రాంతాల్లో కూడా ఉచిత అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు బోర్డ్ తాజాగా నిర్ణయించింది. 230 కోట్ల రూపాయలతో పిల్లల ఆస్పుత్రి నిర్మాణం, 2.73 కోట్ల రూపాయలతో స్విమ్స్ ఆసుపత్రి ఆధునికీకరణ, 25కోట్ల రూపాయలు టీటీడీ సిబ్బంది క్యాష్ లెస్ వైద్యం కోసం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం తయారీకి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కూడా బోర్డ్ నిర్ణయించింది.
వీలైనంత త్వరగా అన్నమయ్య మార్గం
తిరుమల వెళ్లేందుకు అన్నమయ్య మార్గం పేరుతో పురాతన కాలినడక మార్గాన్ని పునరుద్ధరించే ఆలోచనలో ఉంది టీటీడీ. దీనికి అటవీ శాఖ అనుమతి రావాల్సి ఉంది. అయితే అటవీ శాఖ అనుమతి వచ్చేలోపు తాత్కాలికంగా అక్కడ పనులు చేపడతామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
త్వరలో దీనికి ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. తిరుపతి సైన్స్ సెంటర్ కి కేటాయించిన 50 ఎకరాల భూముని వెనక్కి తీసుకుని ఆధ్యాత్మిక నగరం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారాయన.