కరోనా మహమ్మారి తిరుపతిలో స్వైర విహారం చేస్తోంది. తాజాగా శ్రీవారి పరమ భక్తుడు, రెండు దశాబ్దాల పాటు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడికి సేవలందించిన అర్చకుడి ప్రాణాలు తీసుకొంది. తిరుమల మాజీ ప్రధాన అర్చకులు పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు సోమవారం మృతి చెందారు. కరోనా వైరస్ బారిన పడడంతో నాలుగు రోజులుగా ఆయన వైద్య చికిత్స పొందుతున్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులిగా ఆయన సేవలందించారు. గత ఏడాది ప్రధాన అర్చకులు రమణదీక్షితులతో పాటు ఆయన పదవీ విరమణ చేశారు.
పదవీ విరమణ అనంతరం ఆయన తిరుపతిలో నివాసం నివాసం ఉంటున్నారు. పదవీ విరమణ తర్వాత ఏడాదిగా శ్రీవారి కైంకర్యాలకు దూరంగా ఉన్నారు. నాలుగు రోజులుగా ఆయన తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో బాధపడుతూ వచ్చారు. దీంతో శ్వాస తీసుకోడానికి చాలా ఇబ్బంది పడేవారు. నాలుగు రోజులుగా స్వీమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
కాగా తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా దాదాపు 20 ఏళ్లకు పైగా విశేష సేవలందించారు. ఇప్పుడాయనకు కడసారి ఆలయం తరపున సంప్రదాయ పద్ధతిలో వీడ్కోలు పలకడం సంస్కారం. అయితే ఆయన కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవడంతో మృతదేహాన్ని ఎవరూ తగిలే పరిస్థితి లేదు. చివరికి కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాన్ని అప్పగించే అవకాశం లేదంటున్నారు.