వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్నే కాదు, చిన్న పార్టీని కూడా ఎల్లో మీడియా విడిచిపెట్టడం లేదు. నవతరం పార్టీ అభ్యర్థి గాజు గ్లాసు రద్దు చేశారంటూ ఎల్లో మీడియా ఓ పథకం ప్రకారం ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. ఈ ప్రచారంలో ఇటు బీజేపీ-జనసేన కూటమితో పాటు నవతరం పార్టీని కూడా అయోమయంలో పడేసే ఎత్తుగడకు ఎల్లో మీడియా కుట్రపన్నిందని ఆ పార్టీల శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక బరిలో గాజు గ్లాసు రద్దుపై తాజా ట్విస్ట్‌గా చెప్పుకోవచ్చు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేశ్‌కుమార్‌కు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసినట్టు నేడు టీడీపీ కరపత్రికలో ఓ చిన్న వార్త అచ్చు అయ్యింది. నెగెటివ్ వార్తకు సహజంగానే ప్రచారం ఎక్కువగా ఉండడంతో ఈ సమాచారం విస్తృతంగా వ్యాప్తి జరుగుతోంది. మరోవైపు తమ పార్టీ గుర్తు రద్దు చేయలేదని నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేశ్‌కుమార్ చెబుతున్నారు.
ఒక వర్గం మీడియా తెలుగుదేశం ప్రయోజనాల కోసం గాజు గ్లాసు రద్దు చేశారంటూ అసత్య ప్రచారం చేయడం సబబా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ దుష్ప్రచారం వల్ల ఇటు బీజేపీ-జనసేన కూటమితో పాటు తమను గందరగోళ పరిచే దురుద్దేశం కనిపిస్తోందని ఆయన వాపోతున్నారు.
గాజుగ్లాసు గుర్తును నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించడం వల్ల బీజేపీ -జనసేన కూటమి అభ్యర్థి రత్నప్రభకు నష్టం వాటిల్లు తుందని …ఈ మేరకు ఆ కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
గతంలో జనసేనకు గాజుగ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిందని, ప్రస్తుతం బీజేపీతో జనసేన పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థిని బరిలో దింపిందని, ఈ నేపథ్యంలో గుర్తుపై పునఃపరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఈ వినతిపై కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించి, గుర్తు రద్దు చేసినట్టు ఓ పత్రిక వార్తను ప్రచురించడం వివాదాస్పదమవుతోంది.
అసలు గాజు గ్లాసు గుర్తు రద్దు చేసినట్టు ఏ అధికారి చెప్పారు? ఎందుకు చెప్పారనే వివరాలేవీ లేకుండా …ఓ పథకం ప్రకారం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సరికొత్త ఎత్తుగడలకు తెరలేపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాజు గ్లాసు గుర్తు రద్దుపై జిల్లా ఎన్నికల అధికారులు స్పందిస్తే తప్ప… వాస్తవాలు తెలిసే అవకాశాలు లేవు. మొత్తానికి గాజు గ్లాసు గుర్తు ప్రతిపక్ష పార్టీలను ఏ స్థాయిలో భయపెడుతున్నదో ఈ దుష్ప్రచారమే నిదర్శనమంటున్నారు.