బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్లు బాధ్యతాయుతంగా ఉండాలి. ఏదైనా సమాచారాన్ని పంచుకుంటే కాస్త క్రాస్ చెక్ చేసుకోవాలి. మర్కజ్ ద్వారా కరోనా వ్యాప్తి జరిగిందనేది నిజమే, అయితే ఆ తర్వాత అనేక రకాల ఫేక్ న్యూస్ సర్ఫేస్ అయ్యాయి. కొన్ని చోట్ల వైద్యులపై మర్కజ్ వెళ్లి వచ్చిన వారు దాడులు చేసిన దాఖలాలు ఉన్నా, మరి కొన్ని చోట్ల విషయంలో ఫేక్ న్యూస్ లు వచ్చాయి.
వైద్యులపై దాడి జరిగింది, పోలీసులపై దాడి జరిగింది.. అంటూ కొన్ని ఫేక్ న్యూస్ లు వైరల్ అయ్యాయి. అవి ఫేక్ అని ఆ తర్వాత తేలింది. కరోనా కల్లోలం వేళ కొన్ని రకాల రాజకీయ ఉద్దేశాలు ఉన్న వాళ్లు సులువుగా ఫేక్ న్యూస్ ను వైరల్ చేసే అవకాశం ఏర్పడింది. ఇలాంటి సమయంలో తనది కాని వ్యవహారంలోకి తలదూర్చింది హీరోయిన్ కంగనా రనౌత్ చెల్లెలు రంగోళీ.
ఈమె ప్రతి వ్యవహారం మీదా రన్నింగ్ కామెంట్రీ చెబుతూ ఉంటుంది. తన సోదరి కంగనా, తను తప్ప బాలీవుడ్ లో అంతా ఈమెకు చెడుగానే కనిపిస్తారు. అందరి మీదా ఏదో రకంగా బురద జల్లుతూ పొద్దుపుచ్చుతూ ఉంటుంది రంగోలీ. ఊరంతా లోకువే ఈమెకు! మొదట్లో ఈమె పై కొందరికి సానుభూతి ఉండేది, అయితే ఈ రంగోలీ అంతా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉంటుందనే క్లారిటీ ఆ తర్వాత చాలా మందికి వచ్చింది.
ఇక తాజాగా ఈమె ఒక హేట్ ట్వీట్ పోస్టు చేసింది. ఒక వర్గం వ్యక్తి కరోనాతో చనిపోయాడని, అతడి కుటుంబీకులను టెస్టు చేయడానికి వైద్యులు వెళితే వారిని చంపేశారని అంటూ ట్వీట్ చేసింది. అయితే అదెక్కడ జరిగింది, నిజంగా జరిగిందా లేదా.. అనే విషయాలను రంగోళీ పట్టించుకోలేదు. తన ఇష్టానికి పోస్టు చేసి, ఈ విషయాన్ని కవర్ చేయలేదంటూ మీడియాను తిట్టిపోసింది. దానిపై అనేక మంది ట్విటర్ కు ఫిర్యాదు చేశారు. హేట్ ట్వీట్ పోస్టు చేసినందుకు గానూ రంగోళీ ఖాతాను సస్పెండ్ చేసింది ఆ మైక్రో బ్లాగింగ్ సైట్.
అయితే ఆ తర్వాత కూడా రంగోళీ విరుచుకుపడింది. ట్విటర్ అమెరికా సంస్థ అని, దాని భారత్ విషయంలో అసహనంతో ఉంటుందని, భారత ప్రధానిని, హోం మంత్రిని టెర్రరిస్టులు అని అన్నా అడ్డుకోదంటూ.. ఇష్టానికి వచ్చినట్టుగా ట్విటర్ ను తిట్టిపోసింది రంగోళీ. తన ఖాతాను పునరుద్ధరించమని కూడా తను ట్విటర్ ను కోరనంటూ కూడా ప్రకటించుకుంది! ఎవరికి నష్టం?