నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఏకంగా నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎన్టీవో రాష్ట్ర నేతలు అల్టిమేటర్ జారీ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు.
శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తీరుపై మండిపడ్డారు. కోవిడ్ స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ లాంటివి విస్తరిస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిలుపుదల చేయాలన్నారు. ఒకవేళ ఎస్ఈసీ తమ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోని పక్షంలో ఎన్నికల విధులు బహిష్కరిస్తామని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతున్న పరిస్థితుల్లో ఎన్నికల నోటిషికేషన్ విడుదల చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ప్రస్తుతానికి లేవని, ఈ విషయాన్ని పలు దఫాలుగా ఎన్నికల కమీషనర్‌కు తెలియజేశామన్నారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ అప్రజాస్వామికమన్నారు. ఎన్నికల కమిషనర్ మొండిగా నోటిఫికేషన్ విడుదల చేశారని విమర్శించారు.
ఎన్నికలు పెడితే ప్రజలు కరోనాతో భయబ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో 9లక్షలకు పైగా ఉద్యోగులు విధుల్లో ఉన్నారన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నేత సుధీర్‌బాబు అన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశమే లేదన్నారు.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత సూర్యనా రాయణ మండిపడ్డారు. ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం సరికాదని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ వ్యక్తుల కోసం కాకుండా వ్యవస్థ కోసం పని చేయాలని ఆయన హితవు పలికారు.